జ‌గ‌న్ ‘రాజ‌ధాని’ బౌన్స‌ర్‌కు బాబు విల‌విల‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విసిరిన  ‘రాజ‌ధాని’ బౌన్స‌ర్‌కు బాబు విల‌విల‌లాడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు ఉండే అవ‌కాశం ఉంద‌ని అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. జ‌గ‌న్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విసిరిన  ‘రాజ‌ధాని’ బౌన్స‌ర్‌కు బాబు విల‌విల‌లాడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు ఉండే అవ‌కాశం ఉంద‌ని అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. జ‌గ‌న్ పాల‌న‌ను పిచ్చితుగ్ల‌క్ పాల‌న‌తో పోల్చారు. జ‌గ‌న్ కంటే తుగ్ల‌కే న‌య‌మ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బాబు మాట‌లు, ఆయ‌న మూడు ప్రాంతాల్లో రాజ‌ధాని ఏర్పాటుపై ఎంత అస‌హ‌నంగా ఉన్నారో చెప్ప‌క‌నే చెబుతున్నాయి. అయితే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఆనందోత్స‌వాలు వెల్లువిరిస్తున్నాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక‌వేళ జ‌గ‌న్ సీఎం అయితే రాజ‌ధాని అమ‌రావ‌తి మారిపోతుంద‌ని చంద్ర‌బాబు మొద‌లుకుని మిగిలిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టేందుకు జ‌గ‌న్ తాడేప‌ల్లిలో సొంతింటిని నిర్మించుకున్నారు. అంతేకాదు చంద్ర‌బాబు ఇల్లు ఎక్క‌డో చెప్పాల‌ని వైసీపీ ఎదురు దాడి చేసింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాజ‌ధాని మారుస్తార‌నే ప్ర‌చారం ఊపందుకొంది. అందులోనూ మున్సిప‌ల్‌శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌ధానిని స్మశానంతో పోల్చ‌డం తీవ్ర దుమారం రేపింది. అంతేకాకుండా మున‌క ప్రాంతంలో రాజ‌ధానిని ఏర్పాటు చేశారంటూ వైసీపీ మంత్రులు ఓ ప‌థ‌కం ప్ర‌కారం ప్ర‌చారం చేస్తూ జ‌నం మూడ్ మార్చేయ‌త్నం చేస్తూ వచ్చారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాజ‌ధానిపై జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ అమ‌రావ‌తిలో లెజిస్లేటివ్ క్యాపిట‌ల్‌, క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయ‌డం ద్వారా జ్యుడిష‌య‌ల్ క్యాపిట‌ల్‌, విశాఖ‌ప‌ట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ పెట్టొచ్చ‌ని సూచ‌న ప్రాయంగా చెప్పారు.

ఇదే చ‌ర్చ‌లో బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి టీడీపీ రాజ‌ధానిలో ప్ర‌స్తుతానికి 4,070 ఎక‌రాల్లో ఇన్‌పైడ్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని ఆధారాల‌తో స‌భ ముందు పెట్టారు. ఈ సంద‌ర్భంగా బాలకృష్ణ వియ్యంకుడికి జగ్గయ్యపేటలో 499 ఎకరాలు, లింగమనేని రమేష్‌ బంధువుల పేరుతో 351 ఎకరాలు, కంతేరులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ 14.22 ఎకరాలు, నారాయ‌ణ బంధువుల పేరుతో 55.27 ఎక‌రాలు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు 55.27 ఎక‌రాలు, మాజీ మంత్రి రావెల కిషోర్ బుంధువుల పేరుతో 40.85 ఎక‌రాలు, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు బంధువుల పేర్ల‌తో 38 ఎక‌రాలు, మాజీ స్పీక‌ర్ కోడెల కుటుంబ స‌భ్యులు 17.13 ఎక‌రాలు, మాజీ మంత్రి ప‌రిటాల సునీత అల్లుడి పేరుతోనూ, ఇత‌ర టీడీపీ నాయ‌కులు భూములు కొన్న‌ట్టు చెప్పారు.  

భూముల కొనుగోలు వివ‌రాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రించ‌డం ద్వారా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌కు అమ‌రావ‌తిపై ప్రేమ కంటే వారు కొన్న భూముల‌ను కాపాడుకునేందుకే రాజ‌ధాని జ‌పం చేస్తున్నార‌నే అభిప్రాయాన్ని క‌ల‌గ‌జేయ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ స‌క్సెస్ అయ్యింది. అంతేకాకుండా ఒక‌వేళ చంద్ర‌బాబు మూడు ప్రాంతాల్లో రాజ‌ధాని ఏర్పాటును వ్య‌తిరేకించినా జ‌గ‌న్‌కే రాజ‌కీయంగా లాభిస్తుంది. ఎందుకంటే త‌మ ప్రాంతాల్లో రాజ‌ధాని కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకుంటున్నాడ‌ని చంద్ర‌బాబుపై ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల‌లో వ్య‌తిరేక‌త పెరుగుతుంది. దీనివ‌ల్ల రాజ‌కీయంగా టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

జ‌గ‌న్  ప్ర‌క‌ట‌న‌పై భ‌గ్గుమ‌న్న బాబు

అసెంబ్లీలో జ‌గ‌న్ రాజ‌ధానుల ప్ర‌క‌ట‌నపై మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌గ్గుమ‌న్నారు. అసెంబ్లీ బ‌య‌ట ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఇది పిచ్చితుగ్ల‌క్ పాల‌న అని విరుచుకుప‌డ్డారు. మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి జ‌గ‌న్ ఎక్క‌డ నుంచి పాల‌న సాగిస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సీఎం అమ‌రావ‌తిలో ఉంటారా?  విశాఖ‌నా, క‌ర్నూలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ నిర్ణ‌యంతో రాష్ర్టం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌న్నారు.  విశాఖలో సెక్రటేరియట్ కట్టి ఏం చేస్తారు? మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే డబ్బు  ఉండాలి కదా? మండలానికి ఒక ఆఫీసు పెట్టుకోండి ఇంకా బాగుంటుంద‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు.  అసెంబ్లీ నుంచి త‌మ‌ను సస్పెండ్ చేసి రాజధానిపై నిర్ణయం తీసుకుంటారా అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కాలమే సమాధానం చెబుతుందన్నారు.

మొత్తానికి జ‌గ‌న్‌ ఒక్క దెబ్బ‌కు చంద్ర‌బాబును కోలుకోలేని దెబ్బ‌తీశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. శ్రీ‌బాగ్ ఒప్పంద ప్ర‌కారం త‌మ‌కు రాజ‌ధాని లేదా హైకోర్టు ఇవ్వాల‌ని రాయ‌ల‌సీమ వాసులు ఎప్ప‌టి నుంచో ఆందోళ‌న‌లు చేస్తున్నారు. అలాగే వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఇస్తుండ‌డంతో జ‌గ‌న్‌కు రెండు ప్రాంతాల్లో రాజ‌కీయంగా మ‌రింత ప‌ట్టు పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విడ‌వ‌మంటే పాముకు కోప, క‌ర‌వ‌మంటే కప్ప‌కు కోపం అనే చందంగా బాబు ప‌రిస్థితి త‌యారైంది.