ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా ప్రకటించారు. రాజధానిపై అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు మంగళవారం సాయంత్రం రాజధానిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజధానిలో టీడీపీ నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4070 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ఎలా కొన్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులు పక్కాగా, ఓ పద్ధతి ప్రకారం ఇన్‌సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారని ఆధారాలతో సహా సభ ముందు పెట్టారు.
ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ర్టాన్ని ఎలా అప్పులమయం చేసిందో వివరించారు. రాష్ర్టంలో సాగు, తాగునీటి సౌకర్యాల కల్పనకు వేలాది కోట్లు ఖర్చు అవుతాయని ఇంజనీర్ల అంచనాలు చెబుతున్నాయన్నారు. అలాగే విద్య, వైద్యానికి సంబంధించి ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు అయ్యే ఖర్చు తడిసి మోపడవుతుందన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పాలకుల ఆలోచనలు, పాలనా విధానాలు మారాలన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. రాజధాని విషయానికి వస్తే భవిష్యత్‌లో మూడు ప్రాంతాల్లో రాజధాని కేంద్రాలు ఏర్పాటు కావచ్చన్నారు. అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా, కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
రాజధానిపై అధ్యయనానికి రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామన్నారు. అయితే ప్రభుత్వం తన ఉద్దేశాలను లేదా అభిప్రాయాలను కమిటీకి ఏమాత్రం చెప్పలేదన్నారు. ఆ కమిటీ నివేదికలు త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. నివేదికలు రాగానే అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
చివరిగా రాజధాని గురించి ఒక స్పష్టత ఇచ్చినట్టే అన్నారు. ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదని ముగించారు. దీంతో ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ఒక్కో రకమైన ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని కేంద్రాలు ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయిస్తున్నట్టు స్పష్టమవుతోంది.