సిఎఎ వ్యతిరేక ఉద్యమానికి మళయాళ తారల మద్దతు…!

వామపక్ష భావజాలానికి, చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాలకు నిలయం కేరళ అనే సంగతి తెలిసిందే. కార్మిక ఉద్యమాలకు, ప్రగతిశీల ఆందోళనలకు, మేధావులకు, ఆలోచనాపరులకు కేరళ పట్టుగొమ్మ అనే విషయం తెలిసిందే. అలాంటి కేరళలో ఇప్పుడు పౌరసత్వ…

వామపక్ష భావజాలానికి, చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాలకు నిలయం కేరళ అనే సంగతి తెలిసిందే. కార్మిక ఉద్యమాలకు, ప్రగతిశీల ఆందోళనలకు, మేధావులకు, ఆలోచనాపరులకు కేరళ పట్టుగొమ్మ అనే విషయం తెలిసిందే. అలాంటి కేరళలో ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగుస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. ఇక్కడ పాలన సాగిస్తున్నది సీపీఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాబట్టి సహజంగానే సిఎఎ (సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌) ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెసు నేతృత్వంలోని కూటమి కూడా దానికి జత కలిసింది. 

దేశంలో ఎలాంటి వివాదాస్పద ఘటనలు జరిగినా, పరిణామాలు సంభవించినా మాలీవుడ్‌లో అంతోఇంతో స్పందన ఉంటుంది.  కేరళ చిత్రపరిశ్రమలోని తారలు, దర్శకులు ప్రముఖులు సిఎఎ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. సిఎఎ వ్యతిరేకులతో గళం కలుపుతున్నారు. మళయాళ సినీ పరిశ్రమలోని తారలు పార్వతి, రీమా కళ్లింగళ్‌, కుంచాకో బోబన్‌, పృథ్వీరాజ్‌, ఇంద్రజిత్‌, దుల్కార్‌ సల్మాన్‌, తొవినో థామస్‌, ఆషిక్‌ అబూ, జకరియా మహ్మద్‌….ఇలా ఎందరెందరో సిఎఎ వ్యతిరేక ఉద్యమంలో చేరారు. ఇక సోషల్‌ మీడియాలో ఎందరో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తాము పాల్గొనాల్సిన ముఖ్య కార్యక్రమాలను కూడా బహిష్కరించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యసభలో ఆమోదం పొందినరోజే నటి పార్వతి ట్విట్టర్‌ ద్వారా దాన్ని వ్యతిరేకించారు. 

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో, అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీలో పోలీసులు ప్రవేశించడాన్ని ఆమె నిరసించారు. దీన్ని ఈమె ఉగ్రవాదంగా అభివర్ణించారు. దర్శకుడు జకరియా మహ్మద్‌ తాను జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన చిత్రం 'సుదాని ఫ్రం నైజీరియా' ఉత్తమ మళయాళ చిత్రంగా 2019 జాతీయ అవార్డులకు ఎంపికైంది. ఇదే చిత్రంలో నటి సావిత్రి శ్రీధరన్‌ ప్రత్యేక అవార్డుకు ఎంపికయ్యారు. ఈమె కూడా అవార్డుల ప్రధానోత్సవాన్ని బహిష్కరిస్తున్నారు. 

జామియా మిలియాలో, అలీఘర్‌ విశ్వవిద్యాలయంలో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు దేశ వ్యాప్తంగా శాంతి ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో అనేకమంది మళయాళ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనేక సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే నటి రీమా కళ్లింగల్‌ సిఎఎ గురించి కూడా మాట్లాడారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్టం కాగానే ఆమె ఫేస్‌బుక్‌లో 'ప్రశాంతమైన దేశాన్ని మతపరంగా విడదీయకండి.అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఎప్పుడూ ప్రేమతో, శాంతితో ఉండాలి' అని రాశారు. 

నటుడు కుంచకో బోబన్‌ సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. దర్శకుడు అబూ ఆషిక్‌ సిఎఎను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని పాసిజంగా, రేసిజంగా అభివర్ణించారు. పృథ్వీరాజ్‌, ఇంద్రజిత్‌ సోదరులు సెక్యులరిజం వర్థిల్లాలని పోస్టు చేశారు. తాను సమానత్వం కోరుకుంటున్నానని నటుడు జయసూర్య అన్నారు. దుల్కార్‌ సల్మాన్‌ సామాజిక మాధ్యమాల్లో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమానత్వం మన జన్మహక్కులని, వాటికి విఘాతం కలిగిచే ఏ చర్యనైనా అడ్డుకుంటామని అన్నారు. అహింస మన సిద్ధాంతమని అంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా మళయాళ చిత్రపరిశ్రమలో సూపర్‌స్టార్లయిన మమ్ముట్టి, మోహన్‌లాల్‌ మాత్రం సిఎఎ మీద ఎలాంటి అభిప్రాయమూ వ్యక్తం చేయలేదు.