యూపీ దళిత యువతిపై అఘాయిత్యం విషయంలో అక్కడి పోలీసాఫీసర్ ఒకరి ప్రకటన ఈ విషాదఘటనను మరింత వివాదాస్పదం చేసేదిలా ఉంది. అత్యంత తీవ్రమైన గాయాలతో.. ఆసుపత్రి పాలైన ఆమె మృత్యువుతో పోరాడి ఓడింది. ఆమె గాయాల గురించి వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు వింటే ఒళ్లు జలదరిస్తుంది.
ఎంతలా అంటే.. మెడ భాగంలో ఆమెకు అయిన గాయాలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడిందట. అంత కృతకంగా ఆమెను గాయపరిచారు. మెడకు ఒక దుప్పటి లాంటిది కట్టి ఈడ్చుకెళ్లినట్టు, ఆమె జననావయవాలపై తీవ్రమైన గాయాలయినట్టుగా తెలుస్తోంది.
ఆమెను అత్యాచారం చేసి, అత్యంత దారుణంగా హతమార్చారు అనేవి మొదటి నుంచి వచ్చిన వార్తలు. దేశంలో ఎంతో మంది అభాగ్యుణులు ఇలాంటి అఘాయిత్యాలకు బలవుతూ ఉన్నారు. వారిలో కూడా అత్యంత తీవ్రంగా హింసించబడి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది యువతులు. వారిలో ఈ యూపీ యువతి ఒకరు.
అయితే ఇప్పుడు అది రేప్ కేసు కాదు అని యూపీ పోలీసులు కొత్త వాదన మొదలుపెట్టారు. మరి ఆ వాదనకు బలం ఏమిటి? అంటే.. ఫోరెన్సిక్ రిపోర్టు అని చెబుతున్నారు. ఫోరెన్సిక్ పరిశోధనలో ఎక్కడా స్పెర్మ్ జాడ కనిపించలేదట! కాబట్టి అది రేప్ కాదు అని యూపీ పోలీసులు వాదిస్తున్నారు. అయినా ఆమె మృతదేహాన్నే చాలా వ్యూహాత్మకంగా మాయం చేసిన వారిగా యూపీ పోలీసులు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇవ్వకుండా, అర్ధరాత్రి పూట దహనం చేసేసి.. రీ పోస్టు మార్టానికో మరో దానికో అవకాశం ఇవ్వకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఇక ఏమైనా చెప్పగలరు. అంత్యక్రియల విషయంలోనే అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసుల కథనాలను సామాన్యులు నమ్ముతారా? వాళ్ల రికార్డుల్లో ఇక ఏదైనా రాసుకోగలరు.
ఆమె మెడకు గాయం వల్ల చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారట! ఇంకే ముంది..ఆమె ఉరి వేసుకుని చనిపోయిందని తేల్చినా తేల్చగలరేమో!
ఈ అంశం గురించి పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక ఫోరెన్సిక్ అధికారి, ఆమె అత్యాచారానికి గురి కాలేదు అని కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించినట్టుగా ఎన్డీటీవీ పేర్కొంది.