ప్రస్తుతం దేశంలో 90 శాతం స్థాయిలో కరోనా రికవరీ రేటు నమోదు అయిన రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లున్నాయి. ఒక దశలో తమిళనాడులో కరోనా విజృంభించింది. ఢిల్లీ, మహారాష్ట్రాలతో పోటీ పడింది తమిళనాడు. తమిళనాట ఆరు లక్షల స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
తమిళనాడుతో పోలిస్తే ఏపీలో కాస్త లేటుగా కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య సుమారు ఏడు లక్షలుగా నమోదైంది. మరణాల సంఖ్య విషయానికి వస్తే.. తమిళనాడు కన్నా ఏపీ మంచి స్థితిలో ఉంది. ఆరు లక్షల కేసులకే తమిళనాట సుమారు 9,500 మరణాలు నమోదు కాగా, ఏపీలో ఏడు లక్షల కేసులకు గానూ ఆరు వేల లోపే మరణాలు నమోదయ్యాయి.
ఆ సంగతలా ఉంటే.. తమిళనాడు, ఏపీల్లో ప్రభుత్వాల పనితీరు వల్ల కరోనా తీరు గురించి పరిశోధకులకు బోలెడన్ని విశ్లేషణలకు ఆస్కారం ఏర్పడుతోందని తెలుస్తోంది. ఫస్ట్ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ లను సరిగా ట్రేసింగ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడులున్నాయి. ఏపీలో మొదటి నుంచి ట్రేసింగ్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించారు. దేశంలోనే అత్యధిక స్థాయిలో కరోనా టెస్టులు జరిగింది, జరుగుతున్నది ఏపీలోనే. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ల ద్వారానే కరోనాను నిరోధించవచ్చని అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ, తమిళనాడులు ఇచ్చిన వివరాల ద్వారా కరోనా తీరు గురించి మరిన్ని క్లూస్ లభిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే.. కరోనాకు గురి అయిన వ్యక్తులతో ఇళ్లలో కానీ, సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనాకు గురి అయిన దాఖలాలు లేవు!
కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారికీ ఈ రాష్ట్రాల్లో పరీక్షలు బాగా చేశారు. ఆ పరీక్షల ద్వారా ఈ విషయం తేలింది. కేవలం 30 శాతం మంది కరోనా పాజిటివ్ వ్యక్తుల ద్వారా మాత్రమే.. వారి సన్నిహిత వ్యక్తులకు కరోనా సాగింది. 70 శాతం పాజిటివ్ వ్యక్తుల ద్వారా కరోనా వారి సన్నిహితులెవరికీ స్ప్రెడ్ కాలేదు!
ఇది కరోనా వ్యాప్తి తీరును అర్థం చేసుకోవడంలో ఒక రకంగా కీలకమైన అంశమే. ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా వచ్చినంత మాత్రానా.. మిగతా వారికీ సోకే అవకాశం తక్కువే అని నిర్ధారణ అవుతూ ఉంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ద్వారా సమకూరిన భారీ డాటాతో ఈ విషయాన్ని విశ్లేషించారు. ఈ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పరీక్షలు జరిగాయి కాబట్టి.. ఇది కచ్చితంగా నమ్మదగిన డాటా అవుతోంది.
మధుమేహం రోగులకు కరోనా ప్రమాదకరం అని ఈ సమాచారం ద్వారా తెలుస్తోంది. కోవిడ్-19 మృతుల్లో మధుమేహం రోగుల శాతం 45 వరకూ ఉందంటే.. ఆ తరహా ఇబ్బంది పడే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
కరోనాతో ఇప్పటి వరకూ ఈ రాష్ట్రాల్లో మరణించిన వారిలో ఏదో ఒక దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వారి శాతం 63 వరకూ ఉందట!
కరోనా సోకిన వారిలో కూడా కొందరిని సూపర్ స్ప్రెడర్లుగా అభివర్ణించింది ఈ పరిశోధన. వీరు ఎక్కువ మందికి ఆ వైరస్ ను అంటిస్తున్నారట. 60 శాతం కరోనా కేసులు కేవలం ఎనిమిది శాతం మంది ద్వారా వ్యాపించినవే అని ఈ పరిశోధన కర్తలు పేర్కొనడం గమనార్హం. ఆ సూపర్ స్ప్రెడర్లకు నిర్వచనం ఏమిటో ఈ పరిశోధన కర్తలే వివరించాలి.
వైరస్ సోకిన లోడ్ ఎక్కువగా ఉన్న వారు సూపర్ స్ప్రెడర్లు అవుతున్నారా? లేక ఎక్కువ మందిని కలిసే వాళ్లే స్ప్రెడ్ చేస్తున్నారా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అలాగే కరోనా విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేని అంశం వైరస్ లోడ్. కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తుల్లో కొందరిలో ఎలాంటి సింప్టమ్స్ ఉండటం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కొందరిలోనే సింప్టమ్స్ ఉంటున్నాయి, కొందరు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం వారి వ్యాధి నిరోధకత మీదే ఆధారపడి ఉందా? లేక వారికి సోకిన వైరస్ లోడ్ లో ఏమైనా తేడాలున్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంటుంది.
కరోనా పాజిటివా, నెగిటివా అని తేల్చే పరీక్షలు వచ్చాయి కానీ, వైరస్ లోడ్ స్థాయిని ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నట్టుగా ఉన్నారు వైద్యులు. ఈ అంశాలపై కూడా స్పష్టత వస్తే.. కరోనా కట్టడికి మరింత ఆస్కారం ఏర్పడుతుందేమో!