సమీక్ష: ఒరేయ్ బుజ్జిగా
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
తారాగణం: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, వాణి విశ్వనాధ్, హెబ్బా పటేల్, నరేష్, సప్తగిరి, మధునందన్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, సత్య, రాజేష్ తదితరులు
మాటలు: నంద్యాల రవి
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
నిర్మాత: కె.కె. రాధామోహన్
కథ, కథనం, దర్శకత్వం: విజయ్‍కుమార్ కొండా
విడుదల తేదీ: అక్టోబరు 1, 2020
వేదిక: ఆహా
థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన చాలా సినిమాలు ఓ అనుమానం కలిగిస్తున్నాయి. ‘ఇవి అవసరం కొద్దీ ఓటిటి రిలీజ్‍కి సిద్ధపడ్డాయా… లేక వచ్చిన అవకాశాన్ని వాడేసుకున్నాయా?’ అని! ‘ఒరేయ్ బుజ్జిగా’ ఆ అనుమానాన్ని ఇంకొంత పెంచుతుందే కానీ ‘‘అయ్యో పాపం థియేటర్స్లో రిలీజ్ అయి వుండుంటే బాగుండేదే’’ అని మాత్రం అనిపించదు.
‘మిస్టేకెన్ ఐడెంటిటీ’ అంశాన్ని దర్శకుడు విజయ్ కుమార్ కొండా తన మొదటి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో అత్యంత వినోదాత్మకంగా డీల్ చేసాడు. మరోసారి అదే తరహా కథాంశంతో అంతే వినోదాన్ని మళ్లీ అందించగలననే నమ్మకంతో ఈ ప్రయత్నం చేసినట్టున్నాడు. కానీ ఆ సినిమాలో ఆ మిస్టేకెన్ ఐడెంటిటీ అనేది ఇంటర్వెల్‍కి క్లియర్ అయిపోయి, అక్కడ్నుంచీ హీరోహీరోయిన్ల మధ్య కాన్‍ఫ్లిక్ట్ డ్రైవింగ్ సీట్ తీసుకుంటుంది. ఈ చిత్రంలో సదరు ఐడెంటిటీ ఏమిటనేది చివరి వరకు రివీల్ చేయకుండా వీలయినంత సాగదీయడంతో ఫస్ట్ హాఫ్‍లోని ఫ్రెష్‍నెస్‍ని సెకండాఫ్ సిండ్రోమ్ హరించేసింది.
కథానాయకుడి ఐడెంటిటీ దాచిపెట్టే క్రమంలో ఇ.వి.వి. సత్యనారాయణ సినిమాల్లోని కామెడీ సన్నివేశాల్లాంటివి చేయడానికి ప్రయత్నించారు కానీ అలాంటివి పండించడంలో ఆయన అంతటి పట్టు లేకపోవడంతో బొక్కబోర్లా పడిపోయారు. ఒక యువతి, యువకుడు ఒకరికి సంబంధం లేకుండా ఒకరు ఒకేసారి ఇళ్లల్లోంచి పారిపోయి వెళ్లిపోవడం, ఊరంతా వారు లేచిపోయారని నమ్మడం… వాళ్లిద్దరికీ పరిచయమై స్నేహితులవడం, ఇద్దరూ కలిసే వున్నా కానీ తాము ‘లేచిపోయి’ వచ్చామని అనుకుంటోన్న వ్యక్తి ఎవరనేది ఇద్దరికీ తెలియక ఒకరినొకరు వెతికి పట్టుకునే ప్రయత్నాలు చేయడం… ఆరంభంలో ఆసక్తి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన హాస్యాన్ని కూడా పండిస్తుందీ తంతు.
కానీ వేసుకున్న చిక్కుముడిని ఎక్కడ విప్పాలో, ఎలా విప్పాలో తెలియక మరిన్ని ముళ్లు వేసుకుంటూ వెళ్లిపోవడంతో ముగింపెప్పుడో తెలియని అయోమయం నెలకొంది. ఈ క్రమంలో కామెడీ సన్నివేశాలంటూ మొదలు పెట్టిన సీన్లను ఎంత సేపట్లో ముగించాలో కూడా తెలియని గందరగోళం ఏర్పడడంతో మొదట్లో బాగున్నదనిపించిన పాయింటే తర్వాత్తర్వాత విపరీతంగా విసిగించేస్తుంది. ఉదాహరణకు సప్తగిరి, రాజ్ తరుణ్ ఇద్దరూ హాస్పిటల్‍లో చేరే ‘కామెడీ’ సీన్ అయితే సాధారణంగా పాటలప్పుడు వెతుక్కునే రిమోట్ కోసం దేవులాడి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయాలనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్‍లో ఐడెంటిటీ రివీల్ చేయకుండా స్క్రీన్‍ప్లేతో గేమ్ ఆడుతున్నపుడు సరదాగానే అనిపిస్తుంది కానీ క్లయిమాక్స్కి వెళుతున్నా ఇంకా దాగుడు మూతలు ఆడుతుంటే మాత్రం త్వరగా ఎవరేంటో చెప్పేసి ఆ శుభం కార్డేదో వేసేసి మాకీ గోల తప్పిద్దురూ అనిపిస్తుంది. కమర్షియల్ అంశాల పేరిట చేర్చిన అనవసరపు ఫైట్ సీన్లు, క్యారెక్టర్లకు ఎదురయ్యే రొటీన్ ఇబ్బందులూ అసలే సాగతీతగా అనిపిస్తోన్న లవ్‍స్టోరీని చూడడం మరింత కష్టతరం చేస్తాయి. పాటలు బాగుండుంటే అదో రిలీఫ్ అనిపించుండేదేమో కానీ అనూప్ స్వరసారధ్యంలోని పాటల్లో చాలా వరకు రిమోట్‍కి పని చెప్పిస్తాయి.
తనను పెద్దగా ఛాలెంజ్ చేయని పాత్రను రాజ్ తరుణ్ ఈజీగానే పోషించేసాడు. మాళవిక మునుపు కనిపించిన బరువైన పాత్రల కంటే కాస్త భిన్నమైన క్యారెక్టర్ చేసింది. ‘సృజనా తిన్నావా రా’ ఫోన్ రికార్డింగ్ గుర్తుందా? హెబ్బా పటేల్ పాత్రను ఆ ఆడియో క్లిప్పింగ్‍కి స్పూఫ్‍లా డిజైన్ చేసారు కానీ ఇక్కడ కూడా మొదలు పెట్టడమే తప్ప ముగించడమెలాగో తెలియక తికమకపడ్డారు. జోక్ అయినా, సెటైర్ అయినా… క్లుప్తంగా, షార్ప్గా వుండాలి. అప్పుడే అది బాగా పేలుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో కామెడీకి మంచి డైలాగ్స్ హెల్ప్ అయితే, ఈసారి ఆ డిపార్ట్మెంట్ వీకయింది.
పేరున్న నటీనటులు చాలా మంది వున్నా కానీ ఎవరికీ బలమైన పాత్రలూ లేవు, బరువైన సన్నివేశాలూ పడలేదు. పలు సన్నివేశాలలో ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తపన బాగా కనిపించింది కానీ స్క్రీన్‍ప్లే పరంగా ముప్పయ్యేళ్ల నాటి టెక్నిక్స్ని నమ్ముకోవడంతో ‘ఒరేయ్ బుజ్జిగా’ రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. ఇల్లు కదలకుండా, ఒళ్లు అలవకుండా, ట్రాఫిక్ తంటాలు, పార్కింగ్ ఇక్కట్లు వగైరా ఏవీ లేకుండా సౌకర్యవంతంగా సినిమా చూసే వీలుంటుంది కనుక ఓటిటిలో చూస్తే డిజప్పాయింటింగ్ సినిమా చూసినా కాస్త ఆ డిజప్పాయింట్‍మెంట్ మోతాదు తక్కువే వుంటుంది.
కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ కనీసం ఒక అరగంట పాటయినా ఎక్కువ సాగదీయడం వలనో ఏమో ఇంకొంచెం ఎక్కువ నీరసం కలిగించింది. మరి ఇదే సినిమా థియేటర్లో చూస్తే ఆ విసుగు ఎన్నింతలు ఉండేదో ఏమో కానీ మొత్తానికి మరోసారి రాజ్ తరుణ్ లెక్క తప్పింది. అతడికి ఈసారి కథ మంచిదే దొరికింది కానీ కథనం గాడి తప్పడంతో నెక్స్ట్ సినిమాపైకి ఆశలు షిఫ్ట్ చేసుకోక తప్పని పరిస్థితి. ఓటిటిలో ఉత్తుత్తి సినిమాలొస్తున్నాయనే సినీ ప్రియుల కంప్లయింట్‍కి ఇంకొంచెం సౌండ్ పెంచే చిత్రమిది.
బాటమ్ లైన్: సెకండాఫ్ గల్లంతయ్యిందే!
గణేష్ రావూరి