ముఖ్యమంత్రి జగన్ కి పాలనానుభవం లేదు. ఆయన రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఆయన విపక్షంలో ఉంటూ చాలా అనుభవం గడించారు. ఇక మంత్రిగా కూడా పనిచేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే జగన్ ఎలా పాలిస్తారు అన్నది అందరికీ నాడు ఆసక్తికరమే.
జగన్ మంత్రివర్గంలో ముగ్గురు నలుగురు తప్ప అంతా కొత్త వారే ఉన్నారు. అటువంటి సాహసం జగన్ మంత్రివర్గం కూర్పులోనే చేశారు. ఇక డే వన్ నుంచే జగన్ తన సత్తా ఏంటో చాటారు. తాను ఏం చెప్పారో దాన్ని ఒక భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా అమలుచేస్తూ వచ్చారు.
తాజాగా రైతులకు బోర్లు ఉచితంగా తవ్వించి ఇవ్వడం అన్నది గొప్ప కార్యక్రమం. దానితో పాటు బీసీలకు చరిత్ర ఎరగని విధంగా పదవులు ఇవ్వడం. అందరూ బీసీ ఓట్ల కోసం పాకులాడేవారే కానీ వారి కోసం చేసిన వారు బహు తక్కువ. అలాంటిది కేవలం 30 వేల జనాభా ఉంటే చాలు వారి కులానికొక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను సంత్రుప్త స్థాయికి తీసికెళ్ళిన ఘనత కచ్చితంగా జగన్ దే.
అలాగే నామినేటెడ్ పదవులతో సహా అన్నీ కూడా బీసీలకు యాభై శాతం ఇవ్వడం కూడా జగన్ మార్క్ నిజాయతీ రాజకీయంగా చెప్పుకోవాలి. ఇలా జగన్ బీసీల కోసం ఎంతో చేస్తున్నారని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బీసీ నేతగా తాను జగన్ పాలనను చూసి ఆనందిస్తున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు.
అంతే కాదు, తాను జగన్ మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నందుకు గర్విస్తున్నానని బొత్స సంచలనమైన మాటనే అనేశారు. మొత్తానికి జగన్ ఏంటో స్వపక్షం, విపక్షం అన్నది లేకుండా తెలియచెబుతున్నారని అంటున్నారు.