ఈ హడావుడి ముమ్మాటికీ బన్నీదేనా?

పుష్ప..ప్రారంభం అయినపుడు ఓ పెద్ద తెలుగు సినిమా. మధ్యలోకి వచ్చేసరికి భారీ తెలుగు సినిమా. అంతలోనే పాన్ ఇండియా మూవీ. ఆ పై రెండు భాగాల సినిమా. దర్శకుడు సుకుమార్- హీరో బన్నీ కలిసి…

పుష్ప..ప్రారంభం అయినపుడు ఓ పెద్ద తెలుగు సినిమా. మధ్యలోకి వచ్చేసరికి భారీ తెలుగు సినిమా. అంతలోనే పాన్ ఇండియా మూవీ. ఆ పై రెండు భాగాల సినిమా. దర్శకుడు సుకుమార్- హీరో బన్నీ కలిసి చేస్తున్న 180 కోట్ల సినిమా గా రూపాంతరం చెందింది. కరోనా వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. కేరళ షూట్ అనుకుంటే కుదరలేదు. ఆఖరికి రంపచోడవరం లో చేసారు. కొంత సెట్ వేసారు. ఇలా నానా సమస్యలు ఎదుర్కోన్నారు.

కానీ అవన్నీ ఒక ఎత్తు. డిసెంబర్ 17న విడుదల చేసి తీరాలి, అన్న నిర్ణయం ఒక ఎత్తు. అదే ఇప్పుడు సినిమా ప్రమోషన్లను సమూలంగా దెబ్బతీసింది. పుష్ప సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రతి టెక్నీషియన్ కు నిద్రా హారాలు లేకుండా చేసింది. సినిమా మరో అయిదారు రోజుల్లో విడుదల అనగా, ఏ ఒక్క టెక్నీషియన్ ప్రశాంతంగా లేరు. టెన్షన్..ఉరకలు..పరుగులు. దర్శకుడు సుకుమార్ అయితే అసలు కంటికి కునుకు చూసి ఎన్నాళ్లయిందో అన్నట్లుంది పరిస్థితి.

డిసెంబర్ 17 డేట్ కు ఆచార్య రాబోతోంది. డేట్ ప్రకటించబోతున్నారు అన్న ఫీలర్లు ఇండస్ట్రీలో వినిపించడం ఇలా ప్రారంభం కాగానే అర్ఙెంట్ గా పుష్ప డేట్ కొట్టేసారు. దీని వెనుక ముమ్మాటికీ హీరో బన్నీనే వున్నారని, ఇది ఆయన నిర్ణయమే అని గ్యాసిప్ లు గుప్పు మన్నాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా సన్నిహితుల దగ్గర కాస్త కలత చెందినట్లు మాట్లాడారని కూడా వందతులు వినిపించాయి.

ఆ సంగతి అలా వుంచితే ఆ డెడ్ లైన్ మీట్ కావడానికి పుష్ప యూనిట్ పడుతున్న పాట్లు ఇన్నీ అన్నీ కావు. సినిమా ప్రమోషన్ అన్న సంగతి వదిలేసి, సినిమా ఫినిష్ చేసి, 17 కు విడుదల చేయగలిగితే చాలు అన్న పరిస్థితికి వచ్చేసారు. ట్రయిలర్ విడుదల చేయడానికి ఇంతా అంతా టెన్షన్ పడలేదు. నిజానికి కాస్త సమయం వుండి వుంటే అటు బాలీవుడ్ లో, ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కాస్త పబ్లిసిటీ చేసి వుండేవారు. తెలుగునాట పబ్లిసిటీ అవసరం లేకపోవచ్చు.

కానీ ఇక్కడ ఓ సంగతి గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 కోట్లకు పైగా మార్కెట్ అయిన సినిమా అది. అందువల్ల బ‌జ్ ఓ లెవెల్ లో వుండాలి. అలా వుండాలంటే చాలా భయంకరంగా పబ్లిసిటీ వుండాలి. కానీ కేవలం బన్నీ చరిష్మా మీద, హిట్ అయిన పాటల మీద ఆధారంగా సినిమా థియేటర్లలోకి వస్తోంది.

నిజానికి దర్శకుడు సుకుమార్ కాస్త సున్నితమైన మనిషి. ఆయన కాస్త నిదానంగా, ప్రశాంతంగా సినిమాను చెక్కినట్లు తీస్తారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. సుకుమార్ పాటలు పద్దతిగా రాయించుకుని, ట్యూన్లు చేయించుకుంటారు. ఆపైన ఆయన దగ్గర వుండి చిత్రీకరణ చూసుకుంటారు. కానీ ఈసారి కొన్ని పాటల ఆయన ప్రమేయం లేకుండానే చిత్రీకరణ పూర్తి చేసేసుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయడం చాలా కష్టం అయింది. హిందీ డబ్బింగ్ హక్కులు కొన్న సంస్త ససేమిరా అంటే నానా ప్రయత్నాలు చేసి ఒప్పించాల్సి వచ్చింది. అంత చేసిన తరువాత అక్కడ రీచ్ రాకపోతే ఏం సుఖం?  అలా రావాలంటే తొలిసారి బాలీవుడ్ లోకి వెళ్తున్న బన్నీ కోసం ఎంత లాంచింగ్ హడావుడి చేయాలి.

మరో సమస్య ఏమిటంటే, సరిగ్గా పుష్ప విడుదల ముందే ఆర్ఆర్ఆర్ ప్రచారం ఫుల్ స్పీడ్ లో ప్రారంభమైంది. దాంతో తెలుగునాట పక్కన పెడితే మిగిలిన రాష్ట్రాల్లో దానిదే పైచేయి అయిపోయింది. ఎంతో కష్టపడి సినిమా తీసిన సుకుమార్ కు, ట్రయిలర్ విషయంలో టైమ్ చిక్కినట్లు లేదు.దాంతో ట్రయిలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.

సరే, మరో డేట్ లేదు కనుక, ఎవరైనా ఏం చేస్తారు అనొచ్చు. కానీ అదే కనుక ఈ డెేట్ కు ఆచార్య, ఆ డేట్ కు పుష్ప ప్లాన్ చేసుకుంటే బోలెడు సమయం చిక్కేది అన్నీ పక్కా ప్లానింగ్ ప్రకారం జ‌రిగేవి. సుకుమార్ కు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు కాస్త ఊపిరి సలిపేదు.

ఇప్పుడు సినిమా 17న విడుదల అయిన తరువాతే వారికి రెస్ట్. అంత వరకు ఉరకలు పరుగులే. ఇండస్ట్రీ అంతా డేట్ విషయంలో బన్నీదే తప్ప మరెవరిదీ నిర్ణయం కాదు అని వినిపిస్తోంది. అదే నిజ‌మైతే..ఈ టోటల్ సినేరియాకు కారణం ఆ నిర్ణయమే కావాలి.