తిరుమలకు భక్తులు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న రెండు ఘాట్ రోడ్డులతో పాటూ.. మూడోదిగా మరొక రోడ్డు నిర్మించాలని టీటీడీ ట్రస్టుబోర్డు నిర్ణయించింది. అటు టీటీడీ బోర్డు నిర్ణయించిందో లేదో.. అప్పుడే ఈ ఆలోచనను అడ్డుకోడానికి కుట్రలు కూడా మొదలయ్యాయి. తిరుపతి నుంచి కాకుండా, మరొక వైపు నుంచి తిరుమలకు రోడ్డు నిర్మించడం అనేదే సెంటిమెంటుకు విరుద్ధం అంటూ ప్రచారాలు ప్రారంభించారు!
తిరుమలకు ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఎంతోకాలం కిందట నిర్మించిన మొదటి ఘాట్ రోడ్డును తిరుమలనుంచి తిరుపతికి కొండ దిగడానికి, ఆ తర్వాత నిర్మించిన మొదటి ఘాట్ రోడ్డును తిరుమలకు చేరుకునేలా కొండ ఎక్కడానికి వినియోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదభరితంగా మారాయి. ఈ ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
కొన్ని రోజుల కిందట రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడగా.. తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు తృటిలో ప్రమాదం తప్పించుకుంది. అప్పటినుంచి ఈ రోడ్డు మార్గాన్ని మూసేశారు.
లింక్ రోడ్డు వరకు వెళ్లి అక్కడినుంచి మొదటి ఘాట్ రోడ్డు గుండానే తిరుమలకు వాహనాలను అనుమతిస్తున్నారు. రెండో ఘాట్ రోడ్డుకు తక్షణ మరమ్మతులతో పాటు, రెండు ఘాట్ రోడ్లూ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దిశగా.. నిపుణులు, ఇంజినీర్లు కసరత్తు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలనుంచి నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎప్పటికైనా సరే.. పూర్తిగా ఈ రెండు ఘాట్ రోడ్ల మీద మాత్రమే ఆధారపడడం ప్రమాదం అనే భావన పలువురిలో ఉంది. పైగా తిరుమలకు వాహనాల రద్దీ బీభత్సంగా పెరిగింది. దీంతో కొన్ని కీలక సమయాల్లో తిరుపతి అలిపిరి టోల్ గేటు వద్ద.. వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరి నిల్చుండిపోతున్నాయి.
పెరుగుతున్న వాహనాల రద్దీ, భక్తుల అవసరాలకు తగినట్టుగా ఈ రెండు ఘాట్ రోడ్లు చాలడం లేదు. ఈ నేపథ్యంలో కడపజిల్లాలో కోడూరు సమీపం నుంచి.. అప్పట్లో అన్నమయ్య తిరుమలకు కాలినడకన వెళ్లే దారిగా పేరున్న మార్గంలో మరొక రోడ్డు మార్గం నిర్మించాలని టీటీడీ సంకల్పించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని బోర్డు తీర్మానించింది.
అయితే.. ఈ మూడో రోడ్డుతో భగవంతుడి పట్ల మహాపరాధం జరిగిపోతుందని అన్నట్లుగా నాయకులు నానా యాగీ చేస్తున్నారు. అలిపిరి నుంచి మాత్రమే తిరుమలకు చేరుకోవాలనేది భక్తుల సెంటిమెంట్ అని.. ఈ నిర్ణయంతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కొందరు కొత్త వివాదం లేవనెత్తుతున్నారు. మూడో ఘాట్ రోడ్డు ఇంకా ప్రతిపాదన దశలో ఉండగానే.. బాలారిష్టాలు చుట్టుముట్టినట్టు.. వివాదాలు రేగుతున్నాయి.
ఇదంతా తిరుపతి కేంద్రంగా వ్యాపారాలు నడిపించే మాఫియా చేస్తున్న కుట్రగా పలువురు భావిస్తున్నారు. కోడూరు వైపునుంచి ఒక ఘాట్ రోడ్డు వస్తే గనుక.. హైదరాబాదు వైపు నుంచి వచ్చే ప్రతి వాహనమూ అటునుంచి అటే తిరుమలకు వెళ్లిపోతుంది. తిరుపతిలో వ్యాపారం సగానికి సగం పడిపోతుంది. చాలామంది నష్టపోతారు.
అందుకే అలిపిరినుంచి తిరుమలకు వెళ్లడమే సెంటిమెంట్ అని కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఒకవేళ వారు అంటున్నది నిజమే అనుకున్నా.. ఆ సెంటిమెంట్ ఉన్నవారు అలిపిరి నుంచే వెళ్తారు.. సెంటిమెంట్ పట్టింపు లేనివారు అటునుంచి వెళ్తారు కదా అనేది కొందరి వాదన.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏదో ఒక రకంగా దాన్ని రచ్చకీడ్చి ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా పనిచేసే కొందరు దుష్టశక్తులు తిరుమల దేవుడి విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. మూడో ఘాట్ రోడ్డును అడ్డుకోడానికి కుట్రలు ప్రారంభించారు.