ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తే.. సరిగ్గా తమ వయసు వాడినే పెళ్లాలి అనే ఆలోచన భారతీయ యువతుల్లో కనిపిస్తూ ఉంది. కనీసం తెలుగు వారి వరకూ చూసుకున్నా.. అమ్మాయిల ఆలోచన తీరు ఇదే తరహాలో ఉంది. అమ్మాయిలు కూడా కాలేజీ చదువులు దాదాపు తప్పనిసరిగా చదువుకుంటున్న తరుణంలో..తమకు క్లాస్ మేట్ ఏజ్ వాడే తమకు భర్తగా కావాలనుకునే తత్వం బాగా పెరిగింది. లవ్ మ్యారేజీలు ఎక్కువైన నేపథ్యంలో కూడా.. తమ ఏజ్ వాడే తమకు భర్తగా కావాలనుకునే తత్వం బాగా పెరగడానికి ఒక కారణం.
పాతికేళ్ల కిందట అయితే.. పెళ్లి విషయంలో అబ్బాయి వయసు అసలు చర్చే కాదు! ముప్పై, ముప్పై ఐదేళ్ల వయసున్న అబ్బాయికి, పదహారు, ఇరవై యేళ్ల అమ్మాయిని ఇవ్వడానికి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కాదు. అదే 2010కి ముందు.. వరుడు, వధువు మధ్యన కనీసం పదేళ్ల ఏజ్ గ్యాప్ రొటీన్ గా ఉండేది. తమ కన్నా పదేళ్ల వయసు పెద్దవాడైన భర్తను కలిగిన మగువులు ఎంతో మంది.
గత నాలుగైదేళ్లలో మాత్రం పరిస్థితి చాలా వరకూ మారింది. ఇప్పుడిప్పుడే పెళ్లికి ఎదిగిన యువతులు.. తమతో సమాన వయస్కుడే భర్తగా కావాలనే కోరుకుంటున్నారు. కనీసం ఐదారేళ్ల పెద్దవాడిని కూడా.. పెద్దవాడు అనేస్తున్నారు. అంతిమంగా రాజీ పడి ఎవడో ఒకడిని చేసుకోవడం వేరే కథ కానీ, పెళ్లి అనే ఆలోచనలో మాత్రం.. తమ వయస్కుడే కావాలనే ధోరణి ఒకటి ఈ తరం అమ్మాయిల్లో గట్టిగా ఉంది.
అయితే.. విజయవంతంగా సాగే పెళ్లికి ఎవరో ఒకరు వయసులో పెద్దవాళ్లు కావడం ఏ మాత్రం అభ్యంతకరమైనది కాదని అనేక దాంపత్యాలు సాగుతున్నాయి. ఇప్పటికీ సవ్యంగా కాపురాలు చేసుకుంటున్న చాలా జంటల్లో మగాడు స్త్రీ కన్నా పదేళ్లు, అంతకు మించి వయసులో పెద్దవాడు కావడాన్ని గమనించవచ్చు. సమవయస్కుడిని పెళ్లి చేసుకోవాలనే భావన… కేవలం ఆలోచనే తప్ప, అదేమీ విజయవంతమైన పెళ్లికి నకలు ఐడియా కానే కాదు.
పురుషుడు వయసులో పెద్దవాడు కావడం.. పెళ్లికి సంబంధించి.. అనేది ఇండియాకు సంబంధించిన అంశమే కాదు. విదేశాల్లో కూడా ఇదే పద్ధతిగా ఉంటుంది. కొందరు హాలీవుడ్ స్టార్లు అయితే.. తమకన్నా ఇరవై యేళ్ల పెద్దవాడిని కూడా పెళ్లి చేసుకుని, కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్లను చూసినా, వివాహాలు విజయవంతంగా సాగిన గత తరంలో.. భారతీయులను చూసినా.. వయసులో తారతమ్యాలు విజయవంతమైన వైవాహికబంధానికి అడ్డంకి కాదని స్పష్టం అవుతుంది.
అయితే ఈ తరం అమ్మాయిలు ఆలోచన ధోరణి మాత్రం.. వేరే రకంగా సాగుతోంది. తమ సమవయస్కుడే భర్తగా కావాలనేది డిమాండ్ గా మారింది. ఏ ఐదారేళ్ల పెద్దవాడో ప్రేమ ప్రతిపాదన చేసినా.. నువ్వు నా కన్నా చాలా పెద్దోడివి కదా..అని సమాధానాలు ఇచ్చేంత వరకూ వెళ్లింది ఈ తీరు. ఇదే సమయంలో… ఇద్దరూ సమవయస్కులు కావడం వల్ల కూడా దాంపత్యలో చాలా సమస్యలు తలెత్తొచ్చు. మెచ్యూరిటీ లెవల్స్ ఒకే స్థాయిలో ఉండటం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా తలెత్తొచ్చని వేరే చెప్పనక్కర్లేదు!