రాయ‌ల‌సీమ‌ను రెచ్చ‌గొట్టాలనే ప్ర‌య‌త్నం కాదా ఇది?

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం అన్నారు.. సెంటిమెంట్లతో రాజ‌కీయం మొద‌లైంది. రాజ‌ధాని త‌మ ప్రాంతంలోనే కొలువ‌వ్వాలి, త‌మ భూములే విప‌రీత‌మైన ధ‌ర‌లు ప‌ల‌కాల‌నే దురాశపూరిత‌మైన ఈ పోరాటానికి న్యాయ‌స్థానం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  Advertisement…

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం అన్నారు.. సెంటిమెంట్లతో రాజ‌కీయం మొద‌లైంది. రాజ‌ధాని త‌మ ప్రాంతంలోనే కొలువ‌వ్వాలి, త‌మ భూములే విప‌రీత‌మైన ధ‌ర‌లు ప‌ల‌కాల‌నే దురాశపూరిత‌మైన ఈ పోరాటానికి న్యాయ‌స్థానం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

ఒక ప్రాంతంలోనే అంతా ఉండాల‌ని మ‌రో ప్రాంతంలో యాత్ర‌లు చేయ‌డం ఏమిటో మ‌రి. దీని వ‌ల్ల ఆ ప్రాంతంలో అశాంతి రేగే అవ‌కాశాలు  పుష్క‌లంగా ఉంటాయి. అయినా కోర్టుల అనుమ‌తితో ఎంచ‌క్కా అమ‌రావ‌తి పేరిట కొంత‌మంది యాత్ర‌ను చేప‌ట్టారు. సాగిస్తున్నారు. అయితే తామేదో ప్ర‌త్యేకం అయిన‌ట్టుగా వీరు అన్నింటికీ అల్టిమేటాలు జారీ చేస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాయ‌ల‌సీమ‌లో యాత్ర‌ను సాగిస్తున్న అమ‌రావ‌తి పోరాట‌క‌ర్త‌లకు ఉన్న‌ట్టుండి మ‌రో ఐడియా వ‌చ్చింది. అదే అమ‌రావ‌తి స‌భ‌! అది కూడా తిరుప‌తిలో! దీనికి ఎలాగూ తెలుగుదేశం పార్టీ పుష్క‌ల‌మైన మ‌ద్ద‌తును ఇస్తూ ఉంది. ప‌చ్చ‌కండువాలు వేసుకోకుండా టీడీపీ నేతలు ఈ యాత్ర‌కు అన్నింటినీ స‌మ‌కూర్చి పెడుతున్నారు. అంతా తామ‌వుతున్నారు. ఇక ప‌చ్చ‌గా ఉన్న సీమ‌లో రెచ్చ‌గొట్టే ధోర‌ణిని మ‌రింత‌గా చేప‌ట్ట‌డానికి స‌భ‌కు పూనుకున్నారు. ఉన్న‌ట్టుండి తాము స‌భ‌ను నిర్వ‌హించాల‌ని అంటున్నారు.

తాము కోరిన‌ట్టుగా పోలీసులు మ‌ద్ద‌తును ఇవ్వ‌క‌పోతే తాము చేయాల్సింది చేస్తామంటూ మ‌రింత అహంభావ‌పు ధోర‌ణితో కూడా అమ‌రావ‌తి ఉద్య‌మ‌కారులు మాట్లాడుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! బ‌హుశా కోర్టును ఆశ్ర‌యించ‌డ‌మేనో లేక అనుమ‌తి రాక‌పోతే హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తారో మ‌రి! అయితే వీరు కోర్టును యాత్ర‌కు అనుమ‌తిని ఆశిస్తూ ఆశ్ర‌యించిన‌ప్పుడు స‌భ గురించి ఎలాంటి అనుమ‌తీ తీసుకోలేదు!

యాత్ర‌కు మాత్ర‌మే అనుమ‌తి తీసుకున్నారు. యాత్ర‌లో రాజ‌కీయ నినాదాల‌కూ అనుమ‌తి లేదు. మ‌రో ప్రాంతాన్ని కించ‌ప‌రిచే మాట‌ల‌కూ అనుమ‌తి లేదు. అయితే యాత్ర మాత్రం య‌ధేచ్ఛ‌గానే సాగింది. ఇక కోర్టు నుంచి అప్పుడు స‌భ‌కు అనుమ‌తి అడ‌గ‌కుండా, ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని అమ‌రావ‌తి ఉద్య‌మారుల‌కు దుగ్ధ‌తో ఉన్నారు. దీనికి ప్ర‌భుత్వం స‌సేమేరా అంటోంది. మ‌రి కోర్టుకు వెళ్లి వీరు అనుమ‌తి సాధించుకుంటారు కాబోలు!

అయితే ఒక‌వైపు రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని విష‌యంలో అన్యాయం జ‌రుగుతూ ఉంది. శ్రీబాగ్ ఒడంబ‌డిక ప్ర‌కారం అయినా.. ఏర‌కంగా చూసినా రాయ‌ల‌సీమ‌కు ద‌క్కాల్సిన క‌నీస ప్రాధాన్య‌త కూడా ద‌క్క‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో సీమ వేదిక‌గా అంతా అమ‌రావ‌తిలోనే అనే ఉద్య‌మ స‌భ జ‌రిగితే.. దానికి కోర్టు అనుమ‌తిని ఇస్తే.. అది కేవ‌లం రాయ‌ల‌సీమ‌ను మ‌రింత‌గా రెచ్చ‌గొట్ట‌డానికి త‌ప్ప మ‌రోటి కాద‌ని చెప్ప‌వ‌చ్చు. 

రాయ‌ల‌సీమ వేదిక‌గా అంతా అమ‌రావ‌తిలోనే అనే ఉద్య‌మ స‌భ జ‌రిగితే, దానికి తెలుగుదేశం పార్టీ ఎలాగూ స‌హ‌క‌రిస్తుంది కాబ‌ట్టి.. అది విజ‌య‌వంతం అని ప్ర‌క‌టించుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. త‌ద్వారా రాయ‌ల‌సీమ స్వాభిమానాన్నే దెబ్బ‌తీయాల‌ని అమ‌రావ‌తి జేఏసీనో, తెలుగుదేశం పార్టీనే అనుకోవ‌చ్చు. 

ఇలాంటి ప్రాంతీయ విద్వేషాల‌కు దారి తీసే స‌భ‌కు కోర్టు అనుమ‌తిని ఇవ్వ‌క‌పోతే అంద‌రికీ మంచిది. అయితే అమ‌రావ‌తి స‌భ జ‌ర‌గ‌డం న్యాయ‌మే అని కోర్టు భావిస్తే.. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఈ రోజు ఈ ఉద్య‌మాల మీద తిర‌గ‌బ‌డ‌క‌పోవ‌చ్చు గాక‌. వారి చేతిలో ఓటు అనే ఆయుధం మాత్రం ఎప్ప‌టికీ ఉంటుంద‌ని గుర్తించాలి!