నగరి ఎమ్మెల్యే , వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకు సొంత పార్టీలోనే చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరికి చెందిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కె.శాంతికి ఈడిగ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టనున్నారు. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
రాష్ట్రంలో జగన్ తర్వాత వైసీపీలో పాపులారిటీ కలిగిన నేతగా ఆర్‌కే రోజాను ఆ పార్టీ శ్రేణులు అభిమానిస్తాయి. జగన్ కోసం ఆమె ఏడాది పాటు అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరణకు గురయ్యారు.
చంద్రబాబు పాలనలో అనేక అవమానాలు భరించారు. నగరి నుంచి రెండో దఫా ఎన్నికైన తర్వాత జగన్ కేబినెట్‌లో రోజాకు మంత్రి పదవి దక్కుతుందని వైసీపీ శ్రేణులు భావించాయి. తాను కూడా ఎంతో ఆశ పెట్టుకున్న మంత్రి పదవి దక్కక పోవడంతో … కొన్ని రోజుల పాటు ఆమె అలకబూనారు.
ఆ తర్వాత ఏపీఐ ఐసీ చైర్‌పర్సన్ పదవితో రోజా సరిపెట్టుకున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై విమర్శలు చేసేందుకు రోజా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.
అలాంటి మహిళా నేత అంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ “పెద్దా”రెడ్డికి అసలు గిట్టదు. ఆయన వల్లే రోజాకు మంత్రి పదవి రాలేదనే అభిప్రాయాలు కూడా చిత్తూరు జిల్లాలో లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అవకాశం వచ్చినా రోజాకు చెక్ పెట్టేందుకు సదరు పెద్దాయన విడిచి పెట్టరనే అభిప్రాయం బలంగా ఉంది. ప్రస్తుతం వైసీపీ సర్కార్ బీసీ కార్పొరేషన్ల పదవులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఈడిగ కార్పొరేషన్ చైర్మన్‌గా చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కె.శాంతి పేరును ఖరారు చేశారు. ఈమె భర్త కేజే కుమార్ కూడా గతంలో నగరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు.
నగరి నుంచి మొదటిసారిగా రోజా బరిలో దిగే సందర్భంలో కేజే కుమార్ కుటుంబంతో ఆమెకు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. వాళ్ల ఇంట్లో మనిషిగా ఉండేవారు. నగరిలో సొంతింటిని కట్టుకోనప్పుడు … కేజే కుమార్ ఇంట్లోనే రోజా ఉండేవాళ్లు. ఆ తర్వాత వాళ్ల మధ్య విభేదాలు ఎందుకొచ్చాయో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కేజే కుమార్ దంపతుల పేర్లు వినడానికే రోజా అసలు ఇష్టపడడం లేదు.
ఆ మధ్య కేజే కుమార్ ఇంట్లో శుభకార్యానికి ఎవరూ వెళ్లొద్దని రోజా ఏకంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తన అనుచరులను ఆదేశించడం సంచలనమైంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో, తన వ్యతిరేకులకు ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెడుతుండడాన్ని రోజా అసలు జీర్ణించుకోలేకున్నారు.
ఎలాగైనా ఈ నియామకాన్ని అడ్డుకోవాలని రోజా గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కేజే దంపతులకు జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో పాటు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నగరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.