తుళ్లూరు మాజీ తహశీల్దార్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
తుళ్లూరు భూ కుంభకోణంలో మాజీ తహశీల్దార్ సుధీర్‌బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్టే ఎలా ఇస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజా విచారణలో భాగంగా మరోసారి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పేర్కొంది. ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ అంశంపై వచ్చే వారం విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 2020 మార్చి 24న దర్యాప్తుపై విధించిన స్టేపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకవేళ వచ్చే వారం నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం మళ్లీ పరిశీలిస్తుందని జస్టిస్ లావు నాగేశ్వరరావు వెల్లడించారు. దీంతో వచ్చే వారం తుళ్లూరు మాజీ తహశీల్దార్‌తో పాటు మరికొందరిపై సీఐడీ దర్యాప్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.