హీరో నాని నటించి, విడుదలకు సిద్దంగా వున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. వైవిధ్యమైన ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు
శ్యామ్ సింగ రాయ్ ఒక అద్భుతమైన ప్రేమ కథ. నేను 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్నో సినిమాలకు బ్యాకెండ్ పని చేశాను. శ్యామ్ సింగ రాయ్ మేకింగ్ విషయంలో మాత్రం ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ముందు నేను వేరే సినిమా చేయాల్సింది. కానీ నానినే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి జర్సీ ఎలాగో నాకు శ్యామ్ సింగరాయ్ అలాంటి చిత్రం.
సినిమా చూస్తే కచ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం. కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతేకాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం.
ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు.
ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను చేస్తానో కూడా తెలీదు.
నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను.
మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను.నేను ఈ కథ మొత్తం వినలేదు. నాని గారు విన్నారు. ఓకే చెప్పారు.
మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటుంది. నేను నాని గారితో మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఈ సినిమా నేను తీసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు. నిహారిక బ్యానర్ అంటే శ్యామ్ సింగ రాయ్ అని అంటారు.
నాని గారి మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నాని డైరెక్టర్‌ను నమ్మారు.. నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు.
అంటూ ముగించారు వెంకట్ బోయనపల్లి.