టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను మహామేధావి అనుకుంటూ, తరచూ తప్పులో కాలేస్తుంటారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు భూమ్‌రాంగ్ అయ్యాయి. అమరవీరుల స్థూపం నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆంధ్ర ప్రదేశ్ వాసికి ఇవ్వడంపై రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్‌ను దెప్పి పొడిచారు. ఇక్కడే రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాకు చిక్కారు. తెలంగాణలో అర్హులైన కాంట్రాక్టర్లు ఎవరూ లేరా? అని నిలదీస్తున్న రేవంత్‌రెడ్డి…ఒక్కసారి తన అల్లుడెవరో గుర్తించుకుని మాట్లాడితే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నాటి యూపీఏ ప్రభుత్వం విడదీసింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు వాళ్లగా అందరూ కలిసే ఉన్నారు. అయితే రాజకీయంగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలను తరచూ తెరపైకి తెస్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా అని తాజాగా ప్రశ్నించిన రేవంత్‌రెడ్డిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని టెండర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేపీసీ కంపెనీ దక్కించుకుంది. అయితే సదరు కంపెనీకి ఎలాంటి అనుభవం లేదని, తప్పుడు సర్టిఫికెట్లతో పనులు అప్పగించారని రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎవరూ అర్హులు లేరా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడం చర్చకు దారి తీసింది.
రేవంత్‌రెడ్డి ఏకైక కుమార్తె నైమిషారెడ్డికి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యువకుడు సత్యారెడ్డితో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వ్యాపార రీత్యా రేవంత్‌రెడ్డి అల్లుడి కుటుంబం హైదరాబాద్‌లోనే వుంటోంది. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చావని ప్రశ్నిస్తున్న రేవంత్‌రెడ్డి… తాను మాత్రం మంచి అల్లుడిని భీమవరం నుంచి తెచ్చుకున్న విషయాన్ని ఎలా మరిచారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి లేదా ఇతర అంశాల ప్రాతిపదికగా రాజకీయాలు చేసుకుంటే బాగుంటుందని, అలా కాకుండా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు హితవు చెబుతున్నారు. ఆంధ్రా నుంచి మీరు అల్లుడిని తెచ్చుకోవచ్చు గానీ, అక్కడి కాంట్రాక్టర్లు తెలంగాణలో పనులు చేస్తే తప్పా? అని ప్రశ్నించే వాళ్లకు రేవంత్ ఏం సమాధానం చెబుతారు?