తెలుగులో టాప్ చైర్ లో వున్న ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఒకప్పుడు ఫుల్ లీడ్ లో వున్న దేవీశ్రీ ఇటీవల కాస్త వెనకపడ్డారు. సినిమాలు చేస్తున్నా, సరైన అడియో రావడం లేదన్న కంప్లయింట్ వుంది. దర్శకుడు సుకుమార్ కు మాత్రం దేవీ అద్భుతమైన ఆడియో ఇస్తారనే టాక్ ఎప్పటి నుంచో వుంది.
ఆ కాంబినేషన్ లో ఇప్పుడు పుష్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు అన్నీ పాపులర్ అయ్యాయి. హీరో, హీరోయిన్ బేస్డ్ సాంగ్ లు రెండూ బాగా హిట్ అయ్యాయి. అలాగే అయిటమ్ సాంగ్ కూడా సర్రున దూసుకుపోయింది. దాక్కో దాక్క మేక, బిడ్డా ఇది నా అడ్డా కూడా పాపులర్ అయ్యాయి కానీ ఎంతయినా గ్లామర్ పాటలు గ్లామర్ పాటలే.
టోటల్ గా చూసుకుంటే పుష్ప అడియో రంగ స్థలం మాదిరిగా దేవీకి అదనపు కీర్తిని మాత్రం తెచ్చి పెట్టలేదు. ఎందుకంటే శ్రీవల్లి, సామీ, ఊ అంటారా..ఈ మూడు పాటలు కూడా సరైన సింగర్స్ ను ఎంపిక చేయడంతోనే సగం హిట్ కోట్టేసారు. సిద్దు శ్రీరామ్ సరే, మౌనిక, ఇంద్రావతి ఇద్దరు కొత్త సింగర్స్ వాయిస్ లే సంగానికి పైగా ప్లస్ అయ్యాయి. అదే దేవీ లక్ అనుకోవాలి.
అలాగే సామీ, శ్రీవల్లీ, ఊ అంటారా ఈ మూడు పాటలు హుక్ లైన్ లు సూపర్ పాపులర్ అయ్యాయి. కానీ చరణాల్లోకి వెళ్తే అంత కాదు. ఇటు హుక్ లైన్ లు క్లిక్ కావడం, అటు సింగర్స్ వాయిస్ పక్కాగా ఆ ట్యూన్లకు సరిపోవడం తో దేవీ తన సుకుమార్ సెంటిమెంట్ ను నిలబెట్టేసుకున్నారు.
మొత్తం మీద పుష్ప సినిమా వరకు దేవీ పాసయిపోయారు కానీ కాంపిటీషన్ గట్టిగా వున్న కాలంలో, ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఆశిస్తున్న నేపథ్యంలో దేవీ చేస్తున్న, ఇస్తున్న వర్క్ సరిపోదు. ఇంకా చాలా అంటే చాలా కావాలి. అందులోనూ ఊ అంటావా..మావా పాట విషయంలో దేవీని చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒరిజినల్ సాంగ్ తో పాటు దేవీ పాటను కలిపి మిక్స్ చేసి తెగ తిప్పేస్తున్నారు. అందువల్ల దేవీ లోంచి ఒరిజినల్ బయటకు రావాలి. చిరు, పవన్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా అందరు హీరోలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లు ఇచ్చి, తన పాటలతోనే సినిమాలు కూడా నిలబెట్టేసిన ఘనత దేవీకి వుంది. మళ్లీ ఆ మ్యాజిక్ ను దేవీ చేయాలి.