ఈ టైమ్ లో వేటు వేసేంత దమ్ముందా బాబూ..!

వెన్నుపోటు వీరుడు చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచారు పార్టీ నేతలు. కుప్పంలో ఓటమి ఒక్కటే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైసీపీలో చేరే వెసులుబాటు లేక, టీడీపీలో భవిష్యత్తు కనిపించక చాలామంది కోవర్టులుగా మారారంట.…

వెన్నుపోటు వీరుడు చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచారు పార్టీ నేతలు. కుప్పంలో ఓటమి ఒక్కటే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైసీపీలో చేరే వెసులుబాటు లేక, టీడీపీలో భవిష్యత్తు కనిపించక చాలామంది కోవర్టులుగా మారారంట. దీనికి సంబంధించి 70 నియోజకవర్గాల నివేదిక చంద్రబాబు టేబుల్ పై ఉందని తెలుస్తోంది. 

ఇదేదో వైరి వర్గం చెబుతున్న స్టోరీ కాదు, స్వయంగా చంద్రబాబు అనుకూల మీడియా నుంచి వచ్చిన విశ్లేషణ. ఇకపై బాబు, వెన్నుపోట్లను అస్సలు సహించరట. పార్టీలోనే ఉంటూ, పార్టీకి నష్టం చేకూర్చే కట్టప్పల్ని ఉపేక్షించరట.

ఇదంతా చెప్పుకోడానికి బాగుంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యమా అనేది పెద్ద డౌటానుమానం. ఇప్పటికే పాతాళంలోకి పడిపోయిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ నుంచి కోవర్టులు అంటూ కొంతమందిని తొలిగించేంత ధైర్యం, దమ్ము చంద్రబాబుకు ఉందా అనేది ఇక్కడ అసలైన ప్రశ్న.

కోవర్టులను పట్టుకోవడం తేలికే..

చంద్రబాబు లాంటి వెన్నుపోటు వీరుడికి కోవర్టులను పట్టుకోవడం పెద్ద పని కాదు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నప్పటినుంచి తన తర్వాత నెంబర్-2 ఎవరూ లేకుండా చూసుకున్నారు బాబు. ఒకవేళ ఉన్నా కూడా వారిని వెన్నుపోటు పొడిచేంత దగ్గరగా రానివ్వరు బాబు. అలాంటి బాబు ఇప్పుడు పార్టీ అవసాన దశలో కోవర్టు వ్యవహారాలను బాగానే గమనించారు. 

ఎన్నికలనాటికి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఓ బ్యాచ్.. ఇప్పుడు టీడీపీకి భారీగా నష్టం చేకూరుస్తోందని, స్థానిక ఎన్నికల్లో ఓటమికి ఆ గ్రూపే కారణం అని అంచనా వేస్తున్నారు.

మీరే కోవర్టులు.. కాదు మీరే..

టీడీపీలో ప్రతి నియోజకవర్గంలో రెండు బ్యాచ్ లు ఉంటాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, చివరకు ఎవరికీ ప్రయోజనం లేకుండా చేసుకోవడం వీరికి అలవాటు. చంద్రబాబు ఆటలు సాగినంతకాలం వీరిలో ఒకరికి ప్రాధాన్యం దక్కింది, ఇంకొకరికి ఓదార్పు దక్కింది. ఇప్పుడు అధికారం లేకపోవడంతో రెండు వర్గాలు రగిలిపోతున్నాయి.

గతంలో గుర్తింపు దక్కనివారు చంద్రబాబు వ్యవహారం బాగా తెలిసినవారు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. అయితే నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే స్థానికంగా కొన్ని ఇబ్బందులున్నాయి. అందుకే పచ్చగూడు కిందే ఉంటూ.. జగన్ కి మద్దతిస్తున్నారు వీరంతా. ఇలాంటి వారి లిస్ట్ దగ్గర ఉన్నా కూడా ఏమీ చేయలేని విచిత్ర పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు.

పక్కలో బల్లెం.. రోజుకో టార్చర్

నేరుగా చంద్రబాబు ఎవరిపై వేటు వేసినా.. వారు పోతూ పోతూ పార్టీపై బండలు వేసి వెళ్తారు. తమతో పాటు మరికొంతమందినీ తీసుకెళ్తారు. వారే పార్టీని వీడి వెళ్లిపోతే జనంలో సింపతీ రాదు, 2019లో టీడీపీ ఓడిపోయినా రెండేళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే చివరికు మిగిలింది ఇదీ అంటూ, బాబు చేత బహిష్కరణ వేటు వేయించుకుంటే జనాల్లో భారీగా సింపతీ పెరుగుతుంది. 

వైసీపీ వాళ్లు కూడా జాలితో పార్టీలో చేర్చుకుంటారు, స్థానిక నాయకులతో అడ్జస్ట్ మెంట్లు కుదిరిపోతాయి. కానీ ఇలా వారిని బయటకు పంపి హీరోలను చేయడం చంద్రబాబుకి ఇష్టం లేదు. అందుకే వేచి చూస్తున్నారు. 

అందులోనూ పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారవుతున్న దశలో ఇలా ఓ వర్గాన్ని బయటకు నెట్టేసే ధైర్యం చంద్రబాబు చేయరు, చేయలేరు. అందుకే కోవర్టులు కూడా ధీమాగా ఉన్నారు. బాబోరి పక్కనే ఉంటూ.. బాబోరికి చుక్కలు చూపెడుతున్నారు.