మోసం, ద‌గా…ఆయ‌న నోట విన‌డం ఖ‌ర్మ‌రా బాబు!

కొన్ని మాట‌లు కొంద‌రి నోట వింటుంటే… ఒళ్లుపై తేళ్లు, జెర్రులు పాకుతున్న‌ట్ట‌నిపిస్తుంది. మోసం, ద‌గా గురించి మాజీ ముఖ్య మంత్రి, చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతుంటే… అలాంటి ఫీలింగ్ ఎవ‌రికైనా క‌ల‌గ‌కుండా వుండ‌దు. ఎందుకంటే వాటికి బ్రాండ్…

కొన్ని మాట‌లు కొంద‌రి నోట వింటుంటే… ఒళ్లుపై తేళ్లు, జెర్రులు పాకుతున్న‌ట్ట‌నిపిస్తుంది. మోసం, ద‌గా గురించి మాజీ ముఖ్య మంత్రి, చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతుంటే… అలాంటి ఫీలింగ్ ఎవ‌రికైనా క‌ల‌గ‌కుండా వుండ‌దు. ఎందుకంటే వాటికి బ్రాండ్ అంబాసిడ‌ర్ ఆయ‌నే అని స్వ‌యాన ఆయ‌నకు పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్ చెప్పి వెళ్లిపోయారు.

మ‌రీ ముఖ్యంగా దివంగ‌త ఎన్టీఆర్ త‌న అల్లుడైన చంద్ర బాబు ఎంత గొప్ప సంస్కారో, మాన‌వ‌తావాదో ఓ గొప్ప స‌ర్టిఫికెట్‌ను ఇచ్చిపోయారు. సుదీర్ఘ రాజ‌కీయవేత్త‌, ప‌రిపాల‌నాద‌క్షుడైన చంద్ర‌బాబు గురించి భ‌విష్య‌త్ త‌రాలు తెలుసుకునేందుకు….త‌న‌కు వెన్నుపోటు పొడిచిన అల్లుని కీర్తిస్తూ ఎన్టీఆర్ ఎంతో ముందు చూపుతో చ‌క్క‌టి వీడియోను అందించారు.  చంద్ర‌బాబు గురించి అధ్య‌య‌నం చేసే వాళ్ల‌కు ఆ వీడియో ఓ రెఫరెన్స్‌గా వుప‌యోగ‌ప‌డుతోంది.

తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటే న‌వ్వాలో ఏడ్వాలో తెలియ‌ని దుస్థితి. మంగ‌ళ‌గిరిలో టీడీపీ కార్యాల‌యంలో చంద్ర‌బాబు మీడియా ఆవేశంగా మాట్లాడారు. రోజురోజుకీ వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని అన్నారు. త్వ‌ర‌లో ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు కూడా వ‌స్తుంద‌ని చెప్పారు. 

ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయ‌న‌ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్‌ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇది మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నాఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దని చంద్రబాబు హితవు పలికారు.

ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏమొస్తుంద‌ని తాను అధికారంలో ఉండ‌గా ద‌బాయించి దానికి శాశ్వ‌త స‌మాధి క‌ట్టి చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు నిలిచిపోయారు. అలాంటి పెద్ద మ‌నిషి ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాలు చేయాల‌ని వైసీపీని కోర‌డం విడ్డూరంగా ఉంది. అస‌లు ప్ర‌త్యేక హోదాకు బ‌దులు, ప్యాకేజీకి అంగీక‌రించి, ఇప్పుడు పొంత‌న‌లేని డిమాండ్ చేయ‌డానికి చంద్ర‌బాబుకు మ‌న‌సులా వ‌చ్చింద‌నేది ప్ర‌శ్న‌. 

నాడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడు తన పార్టీ స‌భ్యుల‌తో ఎందుకు ఆ ప‌ని చేయించ‌లేదో ముందు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. అన్ని పాపాల‌కు బాధ్యుడైన చంద్ర‌బాబు ఏ నైతిక హ‌క్కుతో ప్ర‌త్య‌ర్థుల‌ను ప్ర‌శ్నిస్తున్నారో స‌మాధానం చెప్పాలి. చంద్ర‌బాబు మిన‌హా మిగిలిన వారెవ‌రైనా వైసీపీని చీల్చి చెండాడే అన్ని హ‌క్కులు క‌లిగి ఉన్నారు.