ఆరోపణలు చేస్తారు …ఆధారాలు ఎందుకు చూపరు?

ప్రతిపక్షాలు అధికార పక్షం మీద, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం సహజం. అది తప్పు కూడా కాదు. కానీ ఇప్పటి నాయకులు విధానాల మీద ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం చాలా తక్కువ. విమర్శలు,…

ప్రతిపక్షాలు అధికార పక్షం మీద, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం సహజం. అది తప్పు కూడా కాదు. కానీ ఇప్పటి నాయకులు విధానాల మీద ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం చాలా తక్కువ. విమర్శలు, ఆరోపణలు చేసేటప్పుడు వెనకా ముందు ఆలోచించరు.  

ఎవరిమీదనైనా ఆరోపణలు చేసినప్పుడు అవి ఉబుసుపోక కబుర్ల మాదిరిగా ఉంటున్నాయి తప్ప నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. ఉంటాయో ఉండవో తెలియదుగాని వాటి గురించి మాట్లాడరు. ఆధారాలతో మాట్లాడేవారు ఎవరో కొద్దిమంది నాయకులే ఉంటారు. 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రతిరోజూ అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఆయన ఏం అవినీతి చేశాడో చెప్పరు. ఇక బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ అయితే దాదాపు ప్రతిరోజూ కేసీఆర్ ను జైలుకు పంపుతామంటాడు. ఆయన ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటాడు. ఆయన చిప్పకూడు తినేరోజు దగ్గరలోనే ఉందంటాడు. కానీ జైలుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పడు. 

జైలుకు పంపుతామన్నప్పుడు కేసీఆర్ చేసిన అవినీతి గురించి కూడా చెప్పాలి కదా. కేసీఆర్ వందశాతం పత్తిత్తు కాడు. అవినీతి పనులు చేసివుండొచ్చు. కానీ ఏం చేశాడనేది జనాలకు తెలియాలి కదా. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లోనే కాంగ్రెస్, టీడీపీ ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశాయి. 

రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఆయనవల్ల ప్రయోజనాలు పొందిన కొందరు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని, జగన్ క్విడ్ ప్రో కో చేశాడని ఆరోపణలు చేసి సీబీఐ దర్యాప్తు చేయించి కేసులు నమోదు చేయించి జైలుకు కూడా పంపారు. కానీ ఆ కేసుల్లో ఆయన దోషో కాదో ఇప్పటివరకు తేల్చలేదు. ఏళ్ళ తరబడి ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. జగన్ మాత్రం ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కేసీఆర్ అవినీతి పనులు చేసి ఉంటే, కోట్ల రూపాయలు తినిఉంటే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేయొచ్చుకదా.

మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాజాగా ఆరోపణలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.తెలంగాణలో 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో వారికే తెలియాలని కేంద్రం తీరును తప్పుబట్టారు. దీనిపై తాను కేంద్రానికి ఫిర్యాదు చేశాడో లేదో తెలియదు. 

నాలుగు లక్షల కోట్ల అవినీతికి ఆధారాలు ఉన్నాయో లేదో తెలియదు. ఏయే అవినీతి పనులు చేశాడో చెప్పడు. యూపీఏ హయాంలో కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు చేశాడంటారు. అవేమిటో తెలియదు. అవి కేంద్రానికి తెలిసి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియదు. రాజకీయ నాయకులు చాలా డ్రామాలు ఆడతారు. ఆ డ్రామాల్లో అవినీతి ఆరోపణలు కూడా భాగమనుకోవాలి.