తోడల్లుళ్లైన చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘ కాలం తర్వాత పరస్పరం కలుసుకోవడం, పలకరించు కోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా మీడియా ఊదరగొడుతోంది.
ఉప్పునిప్పులా ఉన్న ఇద్దరు నేతలు పలకరించుకోవడం వార్తాంశమే. అయితే మనుషులిద్దరూ కలుసుకోవడం లేదా పలకరించుకున్నంత మాత్రాన వాళ్లిద్దరి మధ్య దశాబ్దాలుగా గూడుకట్టుకున్న తీవ్ర విభేదాల మాటేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
చంద్రబాబునాయుడు అనే రాజకీయ నేత పచ్చి మోసగాడని, ఎవరినైనా కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని అనేక సందర్భాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఘాటు విమర్శలు చేశారు.
దివంగత ఎన్టీఆర్కు చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో స్వయంగా దగ్గుబాటి ఓ పుస్తకమే రాశారు. దివంగత ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి కూల్చే కుట్రలో చంద్రబాబు తననెలా పావుగా వాడుకున్నారో దగ్గుబాటి పలు సందర్భాల్లో పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తెలిసిందే.
చంద్రబాబు, దగ్గుబాటి మధ్య వైషమ్యాలు తొలగిపోయేవి కావు. ఎందుకంటే చంద్రబాబు స్వార్థ రాజకీయానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు హృధయం గాయపడింది. తాజాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కూతురు విశాలను పెళ్లి కుమా ర్తెను చేసే కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, దగ్గుబాటి కలుసుకున్నారు.
పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ మాత్రం సంబరానికి నారా , దగ్గుబాటి కుటుంబాలు కలిసిపోయాయని, జగమంత కుటుంబం మాది అంటూ ఆనందంగా గేయాలాపన చేసుకున్నట్టు ఎల్లో మీడియా హోరెత్తిస్తోంది. దగ్గుబాటి, నారా చంద్రబాబునాయుడు కలుసుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు.
ఎలాంటి అరమరికలు లేకుండా మనసులు కలుసుకున్నప్పుడే నిజంగా వాళ్ల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులపై నారా కుటుంబానికి నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే… వారిని టీడీపీలోకి ఆహ్వానించాలి.
తండ్రి లేదా మామ పెట్టిన పార్టీని కాదని…కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి, అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎందుకని చంద్రబాబు చేరదీయాలి. వారిని పార్టీలో చేర్చుకోవాలి. అప్పుడే దగ్గుబాటి, చంద్రబాబు కలయికకు ఓ అర్థంపరమార్థం వుంటుంది. ఏమంటారు చంద్రబాబు సార్?