మూడు రాజధానులు ముగిసిన అధ్యాయం అయితే కాదు. ఇది కొనసాగుతున్న వాడి వేడి అంశం. అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని ఒక వైపు రైతులు పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు రాయలసీమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని సీమ మేధావుల సంఘం గట్టిగానే చెబుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రా నుంచి ఏ రకమైన సౌండ్ లేదా అంటే అక్కడ కూడా రాజధాని కావాలన్న కోరిక ఉంది. అంతే కాదు, మూడు రాజధానులు అన్నది కరెక్ట్ ప్రతిపాదనగా మేధావులు జై కొట్టారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైనది అని కూడా ఓటేశారు.
ఆంధ్రా యూనివర్శిటీ వేదికగా జరిగిన చర్చా గోష్టిలో ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు ముక్తకంఠంతో మూడు రాజధానులను సమర్దించారు. కేంద్రేకరణ అభివృద్ధి అన్నది పాత విధానమని, దాని వల్లనే అనేక ఇబ్బందులు వచ్చాయని కూడా గుర్తు చేసుకున్నారు. కుప్ప పోసినట్లుగా ఒకే చోట అభివృద్ధిని అంతా ఉంచడం ద్వారా అసమానతలు పెరుగుతాయని, అది సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.
మూడు రాజధానులను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా సమ న్యాయాన్ని సాధించాలని వారు గట్టిగా కోరుకున్నారు. విశాఖను పాలనా రాజధానిగా పేర్కొనడం సబబైన విధానమని కూడా పేర్కొన్నారు. విశాఖ వంటి మెగా సిటీని గ్రోత్ ఇంజన్ గా చేసుకుని ఏపీని మొత్తానికి ముందుకు తీసుకుపోవచ్చునని కూడా వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో విభేదిస్తున్నారు వారు కూడా పునరాలోచన చేయాలని వారు సూచించారు.
ఈ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తుందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ అన్నది మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన తరువాతనే చేసి ఉంటే ఈ పాటికి విభజన ఏపీ అన్ని విధాలుగా ముందంజలో ఉండేదని కూడా మరి కొందరు పేర్కొన్నారు.
మొత్తానికి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలలో మూడు రాజధానుల మీద సానుకూలమైన చర్చ సాగాలని కూడా వారు గట్టిగా కోరుకున్నారు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఇది పూర్తి మద్దతు ఇచ్చే చర్చా గోష్టిగానే కనిపిస్తోంది.