అదాని కి కష్టాలు అన్నీ ఒక్కసారిగా వచ్చి పడుతున్నాయా అంటే పరిణామాలు చూస్తే అలాగే ఉంది. అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందన్న హిండెన్‌బర్గ్ నివేదికతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. నాటి నుంచి గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనం అవుతున్నాయి.
అదానీ అంటే ఒక బ్రాండింగ్ గా ఉండేది. ఏపీలో కూడా అదానీ కి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. విశాఖపట్నంలోని గంగవరం పోర్టును అదానీ సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ప్రభుత్వం ఈక్విటీ వాటాగా ఉన్న 10.4 షేర్ ని ఎలాంటి బిడ్డింగ్ నిర్వహించకుండా అదానీ గ్రూపు కి అప్పగించడం పట్ల నాడే విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే అప్పట్లో అదానీ హవా సాగుతున్న క్రమంలో ఈ రణగోణధ్వనులు అన్నీ కూడా పక్కకు పోయాయి. ఇపుడు అదానీ తగ్గారని చిక్కారని పాత విషయాలు అన్నీ మళ్ళీ కొత్తగా తెర మీదకు తీసుకుని వస్తున్నారు. విశాఖ గంగవరం పోర్టును అదానీకి ఇచ్చేశారు అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
అదానీ గ్రూప్ నకు మేలు చేసేలా గంగవరం పోర్టుని అమ్మడం దారుణం చట్టవిరుద్ధం అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అంటున్నారు. గంగవరం పోర్టుని అదానీకి తెగనమ్మడం మీద కాగ్ స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాగ్ కి ఆయన లేఖ రాశారు.
అదానీ విశాఖతో పాటు ఏపీలో ఏఏ ప్రాజెక్టులు టేకప్ చేశారో వాటన్నిటి మీద ఇపుడు గొంతు పెంచి వాటి విషయం మీద కూడా విచారణ చేయాలని అంటున్నరు. కాని కాలం వస్తే అంతా ఇలాగే ఉంటుంది. అదానీ నిన్నటి వరకూ కార్పోరేట్ దిగ్గజం. ఇపుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. దాంతో వ్యతిరేక గళాలు విప్పుకుంటున్నాయని అంటున్నారు.