సీనియర్ హీరోయిన్ జయప్రద తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ, నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. లోక్‌సభ సభ్యురాలిగా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్‌తో ఆమెకు జయప్రదకు రాజకీయ శత్రుత్వం ఉంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.
తాజాగా ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ఉద్దేశించి జయప్రద ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తండ్రీకొడుకులు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని జయప్రద హెచ్చరించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో జయప్రద మాట్లాడుతూ ఆజంఖాన్, ఆయన కుమారుడిపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయంగా ఆజంఖాన్ పని అయిపోయిందని చెప్పుకొచ్చారు.
ఆజం ఖాన్, ఆయన కుమారుడికి వివిధ కేసుల్లో న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. ఆజంకు మూడేళ్లు, కుమారుడికి రెండేళ్ల శిక్ష పడడంతో తండ్రీకొడుకులిద్దరూ శాసనసభ్యత్వాలను కోల్పోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జయప్రద తన అక్కసు వెళ్లగక్కారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలకు అన్ని వేళలా చోటు వుంటుందన్నారు. కానీ ఆజంఖాన్ మాత్రం కనీసం మహిళ అని కూడా చూడకుండా అధికార గర్వంతో అవాకులు చెవాకులు పేలాడని ధ్వజమెత్తారు.
తండ్రీకొడుకులిద్దరికీ మహిళలను గౌరవించడం అసలు తెలియదన్నారు. ఆజంఖాన్, ఆయన కుమారుడు అహంకారంతో విరవీగారని, ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారని జయప్రద అన్నారు.ఇంకా వారు చేసిన పాపాలకు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆమె హెచ్చరించారు.
గతంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పుర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున 2004, 2009లలో వరుసగా లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. నాడు ఆమె సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికయ్యారు. 2019లో అదే పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచి ఆజంఖాన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆజం అసెంబ్లీ బరిలో నిలిచి గెలుపొందారు. రామ్‌పుర్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది.