అయ్యా నమస్కారం. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మీరు రాసిన లేఖ చదివాం. మీ లేఖపై ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సామాన్యుడిగా స్పందిస్తున్నాను. మీ మాటల్లో చెప్పాలంటే పవన్ ప్రసంగాల మల్లే మీ లేఖ అబద్ధాలతోనూ, అసభ్యకర భాషతోనూ నిండి ఉంది. మీరు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా, తత్వవేత్తగా, అన్నిటికి మించి పవన్ రాజకీయ పార్టీ స్థాపించేందేందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన యువకుడిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది, గౌరవించింది. మరెందుకు ఇలా తయారయ్యారు.
పవన్ వైపు మీరు ఒక్క వేలు చూపితే మిగిలిన నాలుగు వేళ్లు మీ వైపు చూపుతున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేకపోయారా? మీకు మీరుగా పవన్‌ను ఉద్ధరించిన వ్యక్తిగా చెప్పారు కాబట్టే ఈ విధంగా అడగాల్సి వస్తోంది, నిలదీయాల్సి వస్తోంది. మీ లేఖలో ఏం రాశారో ఒక్కసారి గుర్తు చేస్తాం….
‘నేను మన పార్టీ (జనసేన) భావజాలాన్ని మరియు రాజ్యాంగాన్ని సృష్టించాను. బలీయమైన ఆలోచనల్ని నిర్మించాను, మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసం ఇచ్చాను, మంచి చెడుల్లో వెన్నంటే నిలబడ్డాను. ఇంకా మీకు ప్రశాంతమైన స్వీయ అవగాహనను అందించాను, అది మిమ్మల్ని శాంతింపజేసింది, మిమ్మల్ని ఉద్ధరించింది, మిమ్మల్ని బలపరిచింది’ అని గొప్పగా చెప్పుకున్నారు.
మీరు ఉద్ధరించానని చెప్పుకుంటున్న పవన్ విషపూరితం ఎలా అయ్యారు. అంటే మీ సిద్ధాంతాలు, ఆలోచనలు పవన్ రాజకీయాలను ప్రభావితం చేయలేదనే కదా అర్థం. లేదంటే మీ సిద్ధాంతాలు, ఆలోచనలే విషపూరితమై ఉండాలి. మీ రాజ్యాంగం పవన్‌ను ఎందుకు బలహీనున్ని చేసింది? నిజాయితీ లేని కుట్రపూరిత మనిషిగా మారారని ఆరోపిస్తున్న మీరు, మరోవైపు పవన్‌ను బలపరిచిందని ద్వంద్వ ప్రమాణాలతో కూడిన స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు.
మీరు సమాజానికి ప్రమాదం అని పవన్ గురించి చెప్పారు. బాగానే ఉంది. ఒక ప్రమాదకరమైన మనిషిని తయారు చేయడంలో మీరు రచించిన జనసేన రాజ్యాంగం, మీ మేధోమధనం నుంచి పుట్టుకొచ్చిన భావజాలం, బలీయమైన ఆలోచనల పాత్ర ఎంతో చెప్పాల్సిన సందర్భం ఇది.
పవన్ చేతుల్లో పాలించే సత్తాకానీ, అధికారం కానీ ఎప్పుడు అనుమతించకూడదని జనాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు 2009లో, 2019లో గ్రహించే కదా అన్నదమ్ములను పక్కన కూచోపెట్టారు. సామాన్య ప్రజలకున్న జ్ఞానం కూడా జనసేన రాజ్యాంత నిర్మాతగా చెప్పుకుంటున్న మీకు లేకపోవడం ఏంటి? ఇంత కంటే విషాదం ఏముంటుంది? పవన్‌ను అంచనా వేయడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ మీరు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయాలపై , పవన్ భావజాలంపై మీ అవగాహన రాహిత్యం, అజ్ఞానం, అమాయకత్వాన్ని మీ లేఖ ప్రతిబింబించింది.
ఆరునెలలు సవాసం చేస్తే వారు వీరవుతారనే సామెత ఉంది. పవన్‌తో 12 ఏళ్లు సవాసం చేసినా మీరు, మీ ఆలోచనలు పవన్‌ను ఏ మాత్రం మార్చలేకపోయాయి. అంతేకాదు మీరు ఆయనలా మారిపోయారు. అందుకే పవన్‌పై విషం చిమ్ముతూ లేఖ రాశారు. అందుకే పవన్‌పై గూడుకట్టుకున్న కోపాగ్ని, విద్వేషపూరిత ఆలోచనలు మీలోని జ్ఞానం, పాండిత్యం, మంచి తనం, దయ, కరుణను చంపేశాయి. అవేవీ లేకపోవడం వల్లే 12 ఏళ్ల స్నేహాన్ని, అనుబంధాన్ని కూడా విస్మరించి పవన్‌పై కక్షపూరిత లేఖకు దారి తీశాయి.
కామన్ మ్యాన్,
ఆంధ్రప్రదేశ్.