జగన్ సర్కార్ అవునంటే టీడీపీ కాదంటోంది. జగన్ సర్కార్ కాదంటే టీడీపీ అవునంటోంది. జగన్ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకించడం ఒక్కటే పాలసీగా ప్రతిపక్ష టీడీపీ పెట్టుకున్నట్టుగా ఉంది. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.
న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే టీడీపీ పాలనలో సాగిన అవినీతి దందాపై విచారణ చేసి తీరుతామని జగన్ అనేక సందర్భాల్లో హెచ్చరించారు.వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని అరికట్టేందుకు జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ చేపట్టింది. దీంతో ప్రతిపక్ష టీడీపీకి ఒళ్లు మండి గగ్గోలు పెడుతోంది.
తనవాళ్లందరికి పప్పుబెలం పంచిన చందంగా పనుల పందేరం చేసిన చంద్రబాబుకు రివర్స్ టెండరింగ్ దిమ్మ తిరిగేలా చేసింది.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం అసెంబ్లీ ఎదుట చంద్రబాబు నాయకత్వంలో రివర్స్ టెండరింగ్‌పై వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా వెనక్కి నడుస్తూ జగన్ రివర్స్ టెండరింగ్‌పై అవహేళన చేశారు.
గత ఐదేళ్లలో చంద్రబాబు పాలన రివర్స్‌లోనే సాగిందన్న విషయాన్ని ఆయన మరిచినట్టున్నారు. పార్టీ ఫిరాయింపులు, నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు భారీగా కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ, ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా కావాలనడం, మోడీని పొగిడిన నోటితోనే తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టడం, ప్రత్యేక హోదాతో ఏ రాష్ర్టాలు బాగుపడ్డాయో చెప్పాలనడం…ఇలా అన్నీ రివర్స్‌లో మాట్లాడిన, పాలన సాగించిన చరిత్ర బాబుది.
చంద్రబాబు నడక , పాలనలో నడత అన్నీ రివర్స్‌లోనే. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఆయన రివర్స్‌లోనే ఆలోచిస్తున్నారు, అడుగులు వేస్తున్నారు. అలవాటైన రివర్స్ జీవితం కావడంతో పాలక పక్షమైనా, ప్రతిపక్షమైనా…సేమ్ టు సేమ్…అదే నడక, నడత. బాబు రివర్స్ వర్ధిల్లాలి.