ఏదీ ఉచితం కాదు.. ఫేస్ బుక్ కూడా మొదలెట్టింది

ట్విట్టర్లో బ్లూ టిక్ కి రేటు కట్టిన ఎలన్ మస్క్, అసలు ట్విట్టర్ లో అకౌంట్ ఉండాలంటే మినిమమ్ చార్జీ వసూలు చేస్తామంటే అడ్డుచెప్పడానికి ఎవరు సాహసం చేస్తారు. ముందు ఉచితంగా అలవాటు చేసి,…

ట్విట్టర్లో బ్లూ టిక్ కి రేటు కట్టిన ఎలన్ మస్క్, అసలు ట్విట్టర్ లో అకౌంట్ ఉండాలంటే మినిమమ్ చార్జీ వసూలు చేస్తామంటే అడ్డుచెప్పడానికి ఎవరు సాహసం చేస్తారు. ముందు ఉచితంగా అలవాటు చేసి, ఆ తర్వాత ఫీజులు వసూలు చేయడమే కార్పొరేట్ స్టైల్. ట్విట్టర్ ఆల్రెడీ అది మొదలు పెట్టింది, ఇప్పుడు ఫేస్ బుక్ కూడా దాన్ని ఫాలో అవుతోంది. మెటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కూడా వెరిఫైడ్ అకౌంట్లకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ జోడిస్తున్నారు. బ్లూటిక్ కోసం రేటు కడుతున్నారు.

11.9 డాలర్లు..

ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లు వెరిఫైడ్ యూజర్స్ గా బ్లూటిక్ పొందాలంటే యాజమాన్యానికి 11.9 డాలర్లు చెల్లించాల్సిందే. మన కరెన్సీలో అది 984 రూపాయలు. నెలకి దాదాపు వెయ్యి రూపాయలు చెల్లించాలంటే మాటలా. సాధారణ అవసరాల కోసం ఫేస్ బుక్ వాడేవారు దాని జోలికే వెళ్లరు. కానీ అదో స్టేటస్ సింబల్ గా మారిందంటే మాత్రం సామాన్యులు కూడా దాన్ని అలవాటు చేసుకోక తప్పదు. ఫేస్ బుక్ మొదలుపెట్టిన ఈ పెయిడ్ వెరిఫైడ్ యూజర్ విధానంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఇప్పటికే దీన్ని తెరపైకి తెచ్చినట్టు తెలిపారు మెటా అధినేత మార్క్ జుకెర్ బర్గ్. అమెరికా సహా ఇతర రాష్ట్రాల్లో త్వరలోనే దీన్ని అమలు చేస్తామంటున్నారు. ఇప్పటికే వెరిఫైడ్ యూజర్లుగా ఉన్నవారికి ఇది అవసరం లేదు, కొత్తగా కావాలనుకునేవారు 18ఏళ్లు నిండినట్టు ఏజ్ ప్రూఫ్ చూపించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డ్ అప్ లోడ్ చేయాలని చెబుతున్నారు. బిజినెస్ పేజ్ లకు ఈ వెరిఫైడ్ యూజర్ ఐడెంటిటీ ఇవ్వరు.

గతంలో అన్నీ ఉచితంగానే ఇస్తామని ప్రచారం చేసుకున్న ఫేస్ బుక్, ఇప్పుడు మెల్లమెల్లగా తన పద్ధతి మార్చుకుంటోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ లాగే యూజర్లను కస్టమర్లుగా భావిస్తోంది. అడ్వర్టైజ్ మెంట్లతో ఆల్రడీ ఆదాయం భారీగానే సమీకరిస్తోంది. ఇటీవల ఆదాయం తగ్గుతుందన్న సాకుతో 11వేలమందిని తొలగించింది కూడా. ఇప్పుడు కొత్తగా వెరిఫైడ్ యూజర్స్ నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది.