ప్రేమ విఫలమైతే చాలామంది ప్రాణాలు తీసుకుంటారు, ప్రేయసి ఒప్పుకోకపోయినా, లేదా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోయినా ప్రాణత్యాగానికి సిద్ధపడతారు. కానీ ఇక్కడ ప్రేయసి ఒప్పుకుంది, ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించారు. మహూర్తాలు పెట్టుకున్నారు. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ జంట ప్రాణాలు తీసింది.
చావాలనుకుని, అంతలోనే బతకాలని..
చావాలనుకుని పురుగుల మందు తాగారు, కానీ అంతలోనే బతకాలన్న ఆశ వారిద్దరిలో మొలకెత్తింది. ఇద్దరూ సొంత ఆటోలో ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ప్రేమ బంధంపై పురుగుల మందు పైచేయి సాధించింది. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న వారిద్దరూ చివరకు చితిపై ఒక్కటయ్యారు. ప్రేమను గెలిపించుకుని, జీవితంలో ఓడిపోయారు.
అసలేం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన నాగవెల్లి శ్రీకాంత్ ఆటో డ్రైవర్. అదే గ్రామంలోని సంఘవితో అతనికి స్నేహం కుదిరింది, అది ప్రేమగా మారింది. సంఘవి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది, శ్రీకాంత్ అటో డ్రైవర్ అని తెలిసినా కూడా సంఘవి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ఇరు కుటుంబాల సమ్మతితో ఈ నెలలోనే పెళ్లికి మహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో సడన్ గా శ్రీకాంత్ కి తన అప్పులు గుర్తొచ్చాయి. అప్పులు పెరిగిపోయాయని, పెళ్లి తర్వాత వేరు కాపురం పెడితే కుటుంబం గడవడం కష్టమని భావించాడు. ఆ విషయం ప్రేయసికి చెప్పి కొన్నిరోజులు పెళ్లి వాయిదా వేద్దామనుకున్నాడు.
తన ఆటోలో ఆమెను తీసుకుని ఊరి చివరికి వెళ్లాడు. అప్పుల విషయం చెప్పి, అనుకోకుండా తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీంతో షాకయిన సంఘవి కూడా అదే పురుగుల మందుని తానూ తాగింది. అయితే ఆ తర్వాత ఇద్దరికీ బతకాలన్న ఆశ కలిగింది. ఆటోలో సంఘవిని తీసుకుని తానే ఆస్పత్రికి వచ్చాడు శ్రీకాంత్. అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ కన్నుమూశారు. ప్రేమని గెలిపించుకున్నారు కానీ, పెళ్లి చేసుకోకుండానే ప్రాణాలు వదిలారు.