విశాఖ రైల్వే జోన్ పై ఏమిటీ అయోమయం ?

విభజన హామీల్లో ప్రధానమైన ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ముగిసిన అధ్యాయమైంది. దాని చరిత్ర కాలగర్భంలో కలిసింది. మరో హామీ విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం దాగుడు మూతలాడుతోంది. రైల్వే జోన్…

విభజన హామీల్లో ప్రధానమైన ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ముగిసిన అధ్యాయమైంది. దాని చరిత్ర కాలగర్భంలో కలిసింది. మరో హామీ విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం దాగుడు మూతలాడుతోంది. రైల్వే జోన్ కచ్చితంగా ఇస్తానని చెప్పదు. ఇవ్వనని చెప్పదు. పార్లమెంటులో టీడీపీ వాళ్ళు అడిగితే ఒకలా సమాధానం వస్తుంది. వైసీపీ వాళ్ళు అడిగితే ఇంకోలా సమాధానం వస్తుంది. దీంతో ప్రజలు గందరగోళం పడుతున్నారు. 

పార్లమెంటులో రైల్వే మంత్రి మొన్న ఒకలాగా మాట్లాడి, నిన్న మరోలా మాట్లాడాడు. ఆయనేమి చెప్పాడో, వీళ్లకు ఏం అర్థమైందో తెలియదు. 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా  దక్షిణ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దానికి వ్యతిరేకంగా ప్రకటించాడు. ఆ తెల్లవారి అంటే నిన్న రైల్వే జోన్ ఎటూ పోలేదు అన్నట్లుగా మాట్లాడాడు. 

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇక లేనట్లే అని మొన్న చెప్పాడు. కేంద్రమంత్రి వైష్ణవ్ ప్రకటనపై ఉత్తరాంధ్ర వాసులు భగ్గుమన్నారు. రైల్వే జోన్ సాధన కోసం మళ్లీ ఉద్యమ బాట పెడతామన్నారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఎన్నికల ప్రచారంలో ఏపీకి రైల్వే జోన్ కేంద్రం ఇస్తున్న కానుక అని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రకటించారు. 

కొత్త జోన్ ఏర్పాటు పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారి (ఓఎస్‌డీ) ని కూడా నియమించింది. ఆయన విశాఖ కేంద్రంలో పనిచేసారు. రాయగడ, విజయవాడ, విశాఖపట్నాలలో ఉద్యోగుల విభజన, జోన్‌ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పరిపాలన విషయాలు, ఇతర అభ్యంతరాలు, ఈ జోన్‌కు వచ్చే ఉద్యోగుల వివరాలను సేకరించి 2019 ఆగస్టులో దీనిపై కేంద్రానికి నివేదిక పంపారు ఓఎస్‌డీ. అయితే ఆ తర్వాత నుంచి రైల్వే జోన్ పని ముందుకు వెళ్లలేదు. 

ఓఎస్‌డీ పంపిన నివేదికలపై ఇంకా ప్రభుత్వం స్పందించలేదు. 2019లో కేంద్రం ప్రకటనతో ఆందోళనలు ఆగిపోయాయి. జోన్ ఇచ్చినా ఉత్తరాంధ్రకు ఫలితం లేకుండా చేశారన్న కోపం ఉన్నా, ఎవరూ రోడ్డెక్కలేదు. ఎన్నికల తరువాత అడపా దడపా పలువురు ఎంపీలు పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యకలాపాలు మాత్రం పెద్దగా చేపట్టలేదు.

ఓఎస్‌డీ పంపిన నివేదికపై రైల్వే శాఖ స్పందించలేదు. గతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే జోన్ గురించి పార్లమెంటులో ప్రశ్నించగా డీపీఆర్ ఆమోదించాల్సి ఉందని దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని అప్పటి రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇంతలోనే వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగించాలంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ సంఘ్ తాజాగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇంతలోనే కేంద్రం షాకిచ్చింది. 

దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని కొత్తగా రైల్వేజోన్ల ప్రతిపాదన లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిస్తూ బా౦బ్ పేల్చారు. ఇదే మంత్రి వారం రోజుల క్రితం (డిసెంబరు 1న) పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్త దక్షిణ కోస్తా జోన్‌కు 2020-21 బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించామని.. ఈ జోన్‌కు తూర్ప కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్‌తో కలిపి రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు. 2019 ఆగస్టులోనే దీని డీపీఆర్‌ను సమర్పించారనీ తెలిపారు. 

వారం తిరిగేసరికి.. ఆ జోన్‌ ప్రస్తావనే లేకుండా సమాధానమివ్వడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు మూడున్నర దశాబ్దాలుగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ ఈ హామీని పొందుపరిచారు. నూతన రైల్వే జోన్ కు ఓఎస్డీగా నియమించి శ్రీనివాస్ ఆర్థిక, సాంకేతిక అంశాలన్నింటినీ పేర్కొంటూ జోన్‌ ఎలా ఏర్పాటు చేయాలో డీపీఆర్‌ను రెండేళ్ల క్రితమే రైల్వే బోర్డుకు పంపించారు. కానీ రైల్వే బోర్డు డీపీఆర్‌ను పక్కన పెట్టేసింది. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖపట్నం రైల్వేస్టేషన్ వద్ద విశాఖ రైల్వేజోన్ సాధన సమితి ఆందోళన చేపట్టింది. 

ఇక ఈ ఏడాది జూలైలో రైల్వే జోన్ అంశంపై గతంలో ఇచ్చిన హామీని ఎప్పటికి నెరవేరుస్తామో చెప్పలేమంటూ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఏపీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకోసం రైల్వే శాఖ డీపీఆర్ కూడా తెప్పించుకుంది. అదంతా నిజమేనని.. అయితే రైల్వే జోన్ ఎప్పటికి వస్తుందో చెప్పలేమని రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ వచ్చిందని.. కానీ ఇంకా పరిశీలనలోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని కుమార్ అప్పట్లో తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు పెద్దల సభలో మంత్రి సమాధానమిచ్చారు. రైల్వే జోన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని తేల్చిచెప్పారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యవతి తాజాగా అన్నారు. తాను పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో విభ‌జ‌న హామీలలో భాగం గా ఉన్న రైల్వే జోన్ అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ముందు ప్ర‌స్తావించానని అన్నారు. ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటికే ప్ర‌కట‌న చేసింద‌ని గుర్తు చేశారు. 

అంతే కాకుండా ప్ర‌స్తుతం రైల్వే జోన్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ. 300 కోట్లు విడుద‌ల చేయ‌డాని కి సిద్ధంగా ఉంద‌ని అన్నారు.దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధం అయింద‌ని తెలిపారు. అయితే కొంత మంది కావాల‌నే రైల్వే జోన్ పై అనవసరంగా ప్ర‌జ‌ల‌ను అయోమయానికి  గురి చేస్తున్నార‌ని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వాల్తేరు డివిజన్ ను ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ లో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామ‌ని సత్యవతి తెలిపారు. కేంద్రం ఆడుతున్న ఈఆట ఏమిటో అర్ధం కావడంలేదు.