వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఓ సినిమా పూర్తవ్వడమే ఆలస్యం, మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. దీంతో అతడి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సైడ్ అయిపోయాయి. అలా కొన్నాళ్లుగా స్తబ్తుగా మారిన ఈ గాసిప్ ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. ప్రభాస్ పెళ్లికి రెడీ అంట. ఈసారి ఈ ప్రచారానికి ఓ లాజిక్ తోడైంది.
ప్రభాస్ ఓ భారీ గెస్ట్ హౌజ్ కమ్ ఫామ్ హౌజ్ ప్లాన్ చేస్తున్నాడు. నానక్ రామ్ గూడలో ఉన్న తన సైట్ లో ఓ లగ్జరీ ఫామ్ హౌజ్ కట్టాలనేది ప్రభాస్ ప్లాన్. మొన్నటివరకు లీగల్ ప్రాబ్లమ్స్ లో ఉన్న ఈ సైట్ ఇప్పుడు క్లియర్ అయింది. ప్రభాస్ సొంతమైంది. ఇందులో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించిన ప్రభాస్, ఆ బాధ్యతల్ని ముంబయికి చెందిన ఓ కనస్ట్రక్షన్ కంపెనీకి అప్పగించాడు.
సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఇంటికి, అతడి పెళ్లికి లింక్ పెడుతూ ప్రచారం మొదలైంది. ఇల్లు రెడీ అయ్యే టైమ్ కి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని, కొత్తింట్లో ప్రభాస్ కాపురం పెడతాడంటూ కథనాలు మొదలయ్యాయి.
నిజానికి ప్రభాస్ కోసం కొత్తగా సంబంధాలు వెదకాల్సిన అవసరం లేదు. తమకు తెలిసిన 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయని గతంలోనే కృష్ణంరాజు ప్రకటించారు. ఎటొచ్చి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ పెళ్లికి ఒప్పుకుంటాడని చెప్పలేం.
ఆదిపురుష్ సినిమాను పూర్తిచేసిన ప్రభాస్, ఆ వెంటనే ప్రాజెక్ట్-K స్టార్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో నిన్నట్నుంచి ప్రభాస్ జాయిన్ అయ్యాడు. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. వీటిలో ఒకటి కంప్లీట్ అయిన వెంటనే స్పిరిట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలాంటి బిజీ టైమ్ లో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా?