దర్శకుడు రాజమౌళి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకటించిన నాటికీ, విడుదల దగ్గర పడుతున్నప్పటికీ ఆయన మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అల్లూరి కొమరం భీమ్ ఇద్దరూ కొంత పిరియడ్ లో కనిపించలేదని, ఆ టైమ్ లో వారు ప్రవాసంలో వున్నారని, ఆ టైమ్ లో ఏం జరిగి వుంటుందో అన్నది ఊహించి, ఓ సినిమా తీస్తున్నామని ఆర్ఆర్ఆర్ ప్రారంభంలో చెప్పారు.
సినిమాలో పాత్రలకు రామ్..భీమ్..సీత అనే పేర్లు పెట్టారు. అంతా బాగానే వుంది. సినిమా విడుదలకు సిద్దం అయింది. ఇప్పుడు సినిమా మొత్తం ఫిక్షన్ తప్ప వేరు కాదంటున్నారు. రామ్..భీమ్ అనే రెండు పాత్రల నడుమ వుండే అపారమైన, అద్భుతమైన స్నేహాన్ని చూపించే సినిమా తప్ప వేరు కాదంటున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్, చరణ్, ఆలియా భట్ కూడా ఈ మీట్ లో పాల్గొన్నారు. మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ఫిక్షన్ అని రాజమౌళి ఈ మీట్ లో పదే పదే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు.
రెండు పాత్రల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్న ఆలోచన సినిమా చూస్తున్నంత సేపు వుండదని అన్నారు. తన సినిమాకు జనాలను తీసుకురావడం కోసమే మెగాపవర్ స్టార్, యంగ్ టైగర్ లాంటి హీరో ట్యాగ్ లు వాడుకుంటా అని, సినిమా స్టార్ట్ అయిన తరువాత వారిలోని నటులే కనిపిస్తారని అన్నారు.
చరణ్ ది తనది చిరకాల స్నేహం అని ఎన్టీఆర్ అన్నారు. సినిమా కోసం స్నేహం కాదని, తమ స్నేహం లోంచి పుట్టిన సినిమా అని వివరించారు. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు స్నేహాన్ని అభిమానాన్ని నటించాల్సిన సమయం వస్తే, ఇక తాము ఆ స్నేహానికి బ్రేకప్ చెప్పేస్తామని రామ్ చరణ్ ఉద్వేగంగా అన్నారు. ఇద్దరు తమ మధ్య వున్నస్నేహాన్ని చెక్ చేసుకుని మరీ కంటిన్యూ చేసుకుంటున్నామన్నారు.
తాను విపరీతంగా కామిక్స్, బొమ్మరిల్లు, చందమామల దగ్గర నుంచి కనిపించిన ప్రతి సాహిత్యం, ప్రతి పుస్తకం చదవడం వల్లనే విజన్ పెరిగిందని, సీన్లు ఆలోచించడానికి పెద్దగా కష్టపడనని, కానీ దాన్ని తెరపైకి తేవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వుంటుందని ఆయన అన్నారు.
ఆలియాభట్ తో మాట్లాడడానికి కొంత కాలం పట్టిందని, ఆరంభంలో కొద్దిగా మొహమాటపడ్డా అని ఎన్టీఆర్ చెప్పారు. రాజమౌళి చెప్పింది చేస్తే చాలు అని, పెద్దగా కష్టపడిపోనక్కరలేదని రామ్ చరణ్ అన్నారు. రాజమౌళి సినిమా చేస్తున్నారన్నదే చూసాను తప్ప పాన్ ఇండియా సినిమానా? మరోటా అన్నది ఆలోచనలోకి రాదని ఇద్దరు హీరోలు చెప్పారు.
ఎన్టీఆర్…చరణ్ సెట్ లో మరీ చిన్న పిల్లల్లా గిల్లి గజ్జాలు ఆడేవారని, తనకు ఫిర్యాదులుచేసే వారని రాజమౌళి అన్నారు.