జగన్ సర్కార్‌కు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెండోసారి జై కొట్టారు. దీనికి అసెంబ్లీ సమావేశాలు వేదికయ్యాయి. అసెంబ్లీ పమావేశాల్లో భాగంగా సోమవారం ఆరో రోజు ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు తీసుకురావడంపై రాపాక ప్రసంగించారు.
సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకమైందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను తీసుకురావాలనే జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాతగిస్తున్నట్టు రాపాక తెలిపారు. సీఎం నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడురోజుల క్రితం ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే జగన్ సర్కార్ నిర్ణయాన్ని రాపాక మద్దతు ప్రకటించారు. జనసేనాని పవన్‌కల్యాణ్ అభిప్రాయానికి విరుద్ధంగా అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రభుత్వానికి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ పాఠశాలల్లోఎక్కువగా దళితులు, అణగారిన వర్గాల వారి పిల్లలు చదువుకుంటున్నారని, దళిత ఎమ్మెల్యేగా వారి భవిష్యత్‌ను ఆలోచించి జగన్ నిర్ణయానికి జై కొట్టానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్ల ఏర్పాటుపై అసెంబ్లీతో రాపాక మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని ఆయన కోరారు