మోడీ తెలివి: పాపమంతా విపక్షాలదే.!

దేశం ఎందుకు భగ్గుమంటోంది.? విద్యార్థులెందుకు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.? ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎందుకు దాపురించినట్లు.? ఈ ప్రశ్నలకు సమాధానం అందరికీ తెల్సిందే.. అదే పౌరసత్వ సవరణ చట్టం. ఈ చట్టం రాకతో…

దేశం ఎందుకు భగ్గుమంటోంది.? విద్యార్థులెందుకు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.? ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎందుకు దాపురించినట్లు.? ఈ ప్రశ్నలకు సమాధానం అందరికీ తెల్సిందే.. అదే పౌరసత్వ సవరణ చట్టం. ఈ చట్టం రాకతో ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆ సెగలు దేశమంతటా వ్యాపించాయి.

తాజాగా హైద్రాబాద్‌లోనూ 'సెగలు' కన్పిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయానికి చట్ట సభల్లో సులువుగానే ఆమోదం లభించిందంటే.. దానిక్కారణం, భారతీయ జనతా పార్టీకి ఆయా సభల్లో వున్న మద్దతు.చట్ట సవరణ చేసేశాం.. ఇక మాకేటి సంబంధం.? అన్నట్లు వ్యవహరిస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌.

ఆ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతోంటే, 'ఇదంతా విపక్షాల కుట్ర..' అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి విషయానికీ దేశ భక్తితో ముడిపెట్టడం కమలనాథులకి పరిపాటిగా మారిపోయింది. జమ్మూకాశ్మీర్‌ విషయంలో కావొచ్చు, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు విషయంలో కావొచ్చు.. ఎవరు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పినా, అది జాతి వ్యతిరేక చర్యగా కమలనాథులు వక్రీకరించడం సర్వసాధారణమైపోయింది.

ఓ నిర్ణయం తీసుకునేముందు, దాని పర్యవసానాల్ని అంచనా వేయడం పాలకుల విధి. ప్రజల్ని అన్ని విషయాల్లోనూ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవచ్చు. కానీ, విధ్వంసకర పరిస్థితులు చోటు చేసుకోకుండా ప్రజల్ని శాంతింపజేయడానికి తగు ముందస్తు చర్యలు చేపట్టాకే, సంక్లిష్టమైన నిర్ణయాలపై ముందడుగు వేయాలి.

దురదృష్టవశాత్తూ అంత చిత్తశుద్ధి నరేంద్ర మోడీ సర్కార్‌కి కన్పించడంలేదు.పెద్ద నోట్ల రద్దు తాలూకు పర్యవసానంపై ఇప్పటిదాకా నరేంద్ర మోడీ సర్కార్‌, దేశ ప్రజలకు వివరణ ఇచ్చింది లేదు. మళ్ళీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి.. పెద్ద నోట్ల రద్దు అద్భుతం.. అని మోడీ సర్కార్‌ చెప్పుకుంటే అంతకన్నా దారుణం ఇంకోటుండదు.

దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఇంకోపక్క, ఏదో ఒక అంశం పేరుతో దేశంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఇలా పరిస్థితి చెయ్యిదారిన ప్రతిసారీ, 'విపక్షాలదే పాపం..' అంటోంది మోడీ సర్కార్‌. ఇప్పుడే అదే చేస్తోంది.
ఎన్నికల్లో గట్టెక్కడానికో.. ప్రజల దృష్టిని మరల్చడానికో.. చేస్తున్న ఈ పబ్లిసిటీ స్టంట్లు.. దేశాన్ని రావణ కాష్టంగా మార్చేస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం.