అమరావతి యాత్ర విషయంలో వైసీపీ మరో తప్పు

అమరావతి రైతుల యాత్రకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకట్ట వేస్తే వారు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు యాత్ర చేరుకుంది. ఇంకో వారం రోజులాగితే తిరుమల శ్రీవారిని దర్శించుకుని…

అమరావతి రైతుల యాత్రకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకట్ట వేస్తే వారు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు యాత్ర చేరుకుంది. ఇంకో వారం రోజులాగితే తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లిపోతారు. 

అయితే తిరుపతిలో యాత్రను అడుగుపెట్టబోనివ్వమంటూ వైసీపీ విద్యార్థి విభాగం హెచ్చరించింది. అదే క్రమంలో రాయలసీమ అభివృద్ధి సంఘాల పేరుతో మరికొంతమంది కూడా అమరావతి రైతుల యాత్రను అడ్డుకుంటామంటున్నారు. ఈ ఘర్షణలో తేలే ఫలితం ఏంటి..?

అమరావతి యాత్రలో రైతులున్నారా, పెయిడ్ ఆర్టిస్టులున్నారా అనే విషయం పక్కనపెడితే.. వారిని అడ్డుకుని వీరు సాధించేదేంటి..? లేనిపోని సింపతీ పెంచి పోషించడం తప్ప. యాత్రపై లేనిపోని ఫోకస్ పెంచడం తప్ప. 

ఇలా అడ్డుకోవాలని, ఘర్షణ జరగాలని, దాన్ని అనుకూల మీడియాలో చిలువలు పలువలు చేసి చూపించాలనేది టీడీపీ ప్లాన్. ఆ ప్లాన్ లో వైసీపీవాళ్లు పడిపోవడం ఏంటి..?

రాయలసీమ మేధావుల ఫోరం కూడా యాత్రను తిరుపతిలో సాగనివ్వబోమంటున్నారు. అయితే ఈ మేధావుల వెనక ఎవరున్నారనేది బహిరంగ రహస్యం. అమరావతి యాత్రకు ఎక్కడ ఎవరు అడ్డు తగిలినా, ఏ రూపంలో ఇబ్బంది ఎదురైనా వారు నేరుగా టార్గెట్ చేసేది జగన్ నే. 

విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నా.. మేథావుల ఫోరం అడ్డుకోవాలని చూసినా.. జగన్ పై పడి ఏడవడం మొదలవుతుంది. ప్రభుత్వం దమనకాండ, పోలీసుల దౌర్జన్యం అంటూ పెద్ద పెద్ద డైలాగులు పేలుతాయి. 24గంటలు మీడియాలో కనిపించడానికి ఉత్సాహపడే కార్పొరేట్ రైతులు సైతం రంకెలేస్తూ ముందుకొస్తారు.

అందులోనూ తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి అడ్డుపడుతున్నారంటూ దేవుడి సెంటిమెంట్ కూడా రెచ్చగొడతారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అన్నట్టు.. అమరావతి పాదయాత్రను అడ్డుకుని రచ్చ చేసుకోవడం కంటే.. వారిని పట్టించుకోకుండా ఉండటమే మేలు. అయితే పట్టించుకోకుండా వదిలేస్తే టీడీపీ నేతలు ఊరుకుంటారా అనేది కూడా అనుమానమే. 

అమరావతి యాత్రకు సంఘీభావం పేరుతో ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారు. పరోక్షంగా వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. వీరి బుట్టలో పడటం కచ్చితంగా వైసీపీ చేస్తున్న తప్పే.

ఆల్రెడీ ఓసారి పాదయాత్ర మొదలు కాకుండానే అడ్డుకున్నారన్న పేరొచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరుపతిలో యాత్రను అడ్డుకుంటే కచ్చితంగా అది మరో అపనిందను మీద వేసుకున్నట్టవుతుంది. ఏ రూపంలో అడ్డు తగిలినా.. అది వైసీపీ మీదకే వస్తుంది కాబట్టి.. రెండోసారి ఆ తప్పు చేయకపోవడమే మంచిది. 

ఎలాగూ మూడు రాజధానుల బిల్లు కూడా ఇప్పుడు లేదు కాబట్టి, లేని బిల్లుని అడ్డుకుంటూ యాత్ర చేస్తున్న రైతుల్ని పూర్తిగా విస్మరించడం మేలు.