ఏపీలో సినిమా టికెట్ ధరలు తమ సినిమా స్థాయికి సరిపోవు అని అన్నారు… ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య. తమ సినిమా దర్శకుడు, హీరోలతో కలిసి మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న దానయ్య, భారీ బడ్జెట్ పెట్టిన తమ బోటి సినిమాలకు ఏపీలో టికెట్ ధరలు సరిపోవన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలన్నారు. ఈ విషయంలో తాము ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్టుగా కూడా చెప్పారు.
ఇక ఈ సినిమా లో ఒక హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు ఏపీ ప్రభుత్వంలో మంచి పొజిషన్లో ఉన్నారని, వారి ద్వారా ఏమైనా ప్రయత్నాలు సాగిస్తున్నారా.. అనే ప్రశ్నకు సమాధానాన్ని దాట వేశారు.
ఈ ఇద్దరు ఎవరో వేరే చెప్పనక్కర్లేదు. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లు ఈ విషయంలో ఏమైనా సాయంగా నిలుస్తున్నారా? ఎన్టీఆర్ కు సన్నిహితులుగా పేరు పొందిన వారు ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారా అనేది ఆసక్తిదాయకమైన అంశమే.
అయితే ఎన్టీఆర్ తో తమకు గత సాన్నిహిత్యం లేదని ఇటీవలే కొడాలి నాని బహిరంగంగా చెప్పారు. గతంలో తాము ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన మాట వాస్తవమేనని, ఇప్పుడు తమకు ఆ సాన్నిహిత్యం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల విషయంలో, కొడాలి, వల్లభనేని వంశీల పేర్లు చర్చలోకి రావడం గమనార్హం!