మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థక్కూడా పరిమితులున్నట్టు… వార్తను ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు సాక్షి మీడియాకు కూడా పరిమితులున్నాయి. ఈ విషయం ఇవాళే తెలిసింది. అది కూడా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టుపై తీవ్ర, సంచలన వ్యాఖ్యలు చేస్తే, వాటిని యథాతథంగా లోకానికి తెలియజేయడానికి సాక్షి మీడియా ఆచితూచి క్యారీ చేయడం చూస్తే… ఎవరికైనా పరిమితుల అభిప్రాయం కలుగుతుంది.
ఏపీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకుందనే అభిప్రాయం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారంలో ఉంది. ఏపీ హైకోర్టు నాటి చీఫ్ జస్టిస్, మరో ముగ్గురు జడ్జిలు, నాటి సుప్రీంకోర్టు జడ్జిపై పలు ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాయడం, అది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. న్యాయమూర్తులు మారినా… న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వ సంబంధాలు మాత్రం అంతంత మాత్రమే.
ఈ నేపథ్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జైభీమ్ సినిమా ఫేమ్ జస్టిస్ చంద్రు విజయవాడ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి తాను వ్యతిరేకించే న్యాయ వ్యవస్థపై జస్టిస్ చంద్రు ఘాటు వ్యాఖ్యలను ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ సాక్షి నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. గుడ్డిలో మెల్లలా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను కవర్ చేసిన ఆంధ్రజ్యోతిని అభినందించొచ్చు.
‘న్యాయ వ్యవస్థక్కూడా పరిమితులున్నాయి’ అనే శీర్షికతో జస్టిస్ చంద్రు ఘాటు వ్యాఖ్యలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా పుండుమీద కారం చల్లినట్టు అవుతుందని, న్యాయ వ్యవస్థతో ఘర్షణ మరింత పెంచుకోవడం ఇష్టం లేకే సాక్షి జస్టిస్ చంద్రు వ్యాఖ్యల తీవ్రతను తగ్గిస్తూ పాఠకలోకానికి తెలియజేయాలని భావించినట్టుంది. మరోవైపు ఎటూ సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు విస్తృత ప్రచారం కావడంతో ఇక ఆ పని తాము చేయాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్టుంది.
రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారనే వాక్యంతో సాక్షి సరిపెట్టింది. జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టింగులు, వాటిపై సీబీఐ విచారణ, నిందితుల కోసం విదేశాలకు వెళ్లడాన్ని జస్టిస్ చంద్రు తప్పు పట్టడాన్ని సాక్షి ఆవిష్కరించింది. ఇదే అమరావతిలో భూకుంభ కోణంపై ఎఫ్ఐఆర్ నమోదు, దానిపై విచారణ జరగకుండా హైకోర్టు స్టే ఇవ్వడంపై జస్టిస్ చంద్రు ఆశ్చర్యపోవడాన్ని సాక్షి ఉద్దేశ పూర్వకంగానే రాయలేదు.
అలాగే మూడు రాజధానుల బిల్లులపై విచారించే బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు అమరావతిలో ఇంటి స్థలాలు తీసుకున్నారనే కారణంతో వారిని విచారణ నుంచి తప్పుకోవాలనే ప్రభుత్వ డిమాండ్‌ను జస్టిస్ చంద్రు ప్రస్తావించారు. విచారణ నుంచి తాము తప్పుకునేది లేదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పడాన్ని కూడా జస్టిస్ చంద్రు తప్పు పట్టారు.
ఈ సంగతుల జోలికి సాక్షి వెళ్లకపోవడం గమనార్హం. ఇంకా న్యాయ వ్యవస్థకు సంబంధించి జస్టిస్ చంద్రు సంచలన విషయాలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏది ఏమైనా జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టుపై నిన్న చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.