రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ కేంద్ర వ్యవసాయం శాఖ నుంచి రైతు సంఘాలకు గురువారం నాడు లిఖితపూర్వకమైన హామీ లభించడంతో 15 నెలలుగా సాగుతున్న రైతు ఆందోళన ముగిసింది. దానికి మొదటి మెట్టుగా సాగుచట్టాల రద్దు బిల్లును పార్లమెంటులో పాస్ చేశారు, ఏ చర్చా లేకుండా! 2020 జూన్‌లో ప్రవేశ పెట్టినపుడు ఎంత లక్షణంగా చేశారో, తీసేసినపుడూ అంతే. ప్రజలకు, స్టేక్‌హోల్డర్స్‌కు నచ్చచెప్పే ప్రయత్నం అప్పుడూ చేయలేదు, యిప్పుడూ చేయలేదు. మోదీ అంతటి 56 అంగుళాల ఛాతీ మనిషి క్షమాపణ చెప్పారు, అంతకంటె యింకేం కావాలి? అనుకోవచ్చు. నిజమే, ముఖ్యమంత్రిగా కానీ, ప్రధానిగా కానీ మోదీ అసెంబ్లీని లేదా పార్లమెంటును తన విశ్వాసంలోకి తీసుకోలేదు. తన ఊహలు చెప్పి, చర్చలు జరిపే అలవాటు లేదు. తప్పు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఒప్పుకుంటే బలహీను డనుకుంటారన్న భయమో ఏమో! ఇప్పటిదాకా వెనక్కి తగ్గిన సందర్భాలు రెండే వున్నాయి. ఒకటి లాండ్ ఎక్విజిషన్ ఆర్డినన్స్‌ను చట్టంగా మార్చకపోవడం, రెండోది జిఎస్‌టి విషయంలో!
నోట్ల రద్దు సమయంలో పదిహేను రోజుల సమయంలోనే తప్పులు బయటపడ్డాయి. ఎటిఎంలలో కొత్త నోట్లు పడతాయో లేదో చూసుకోలేదని, పెద్ద నోట్లను రద్దు చేస్తూ అంతకంటె పెద్ద 2 వేల రూ.ల నోటును ప్రవేశపెట్టడంలో తర్కం లేదని, రిజర్వు బ్యాంకు ప్రమేయం లేకుండా నోట్ల పంపిణీ అయిపోతోందని, జనధన్ ఖాతాల ద్వారా నల్లధనం తెల్లగా మారిపోతోందని… యిలా చాలా విషయాలు బయటపడగానే నోట్ల రద్దును వెనక్కి తీసుకుంటారని నేననుకున్నాను. కానీ తీసుకోలేదు. దేశం చాలా నష్టపోయింది. అలాగే జిఎస్‌టి ప్రవేశపెట్టినపుడు కూడా రెండోసారి స్వాతంత్ర్యం వచ్చినంత హంగు చేశారు. తీరా చూస్తే విధానమంతా తప్పుల తడక. మొదట్లో మార్పులు చేయడానికి యిష్టపడలేదు. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యాపారస్తులందరూ ఎదురు తిరుగుతున్నారని గ్రహించి, మార్పులు చేశారు. అప్పణ్నుంచి చేస్తూనే వున్నారు.
ఇప్పుడీ సాగు బిల్లుల విషయంలో ఏడాదికి పైగా మొండి వైఖరి ప్రదర్శిస్తూనే వున్నారు. దాదాపు 700 మంది చనిపోయినా చలించలేదు. వ్యతిరేకించిన వాళ్లందరినీ ఖలీస్తానీలన్నారు, కమిషన్ ఏజంట్ల తొత్తులన్నారు, దేశద్రోహులన్నారు. రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోలేక దాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి రిపబ్లిక్ డే నాడు అస్మదీయుడి చేతనే జండా ఎగరేయించి గగ్గోలు పెట్టేశారు. అస్మదీయుడు కాకపోతే అతనికి కఠినశిక్ష పడి వుండేది. అతనికి శిక్ష పడిందో లేదో ఎవరైనా చెప్పగలరా? రైతుల ఉద్యమం డీలా పడిందనుకుని ఆ సంగతిని తొక్కేశారు. పంజాబ్, హరియాణా రైతులు విసిగి వేసారి, కాడి పడేశారు అనుకుంటూండగానే కార్యక్షేత్రం యుపికి మారింది. యుపిలోని లఖ్కింపూర్‌లో జరిగిన హత్యాకాండతో రైతులే కాదు, దేశప్రజలందరూ ఆగ్రహోదగ్రులయ్యారు. ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్న యుపి, పంజాబ్‌లో రైతులందరూ కక్ష కట్టి బిజెపిని ఓడిస్తారనే భయం పట్టుకుంది. దాంతో సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది.
లఖ్కింపూర్ ఘటన జరిగి వుండకపోతే సాగు చట్టాలపై రిస్కు తీసుకుని, రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసేవారేమో తెలియదు. ఎందుకంటే బిజెపి కథంతా ‘అజేయుడు మోదీ’ అనే థీమ్ చుట్టూనే తిరుగుతోంది. మడమ తిప్పడం దానికి విఘాతం కల్గిస్తుంది. ఆ విఘాతం కంటె రైతు ఆగ్రహం ఎక్కువ డేంజరస్ అనుకున్నారని అనుకోవాలి. ఏమిటా ఘటన? చాలామందికి రేఖామాత్రంగా తెలిసే వుంటుంది. దానికి కారణభూతులైన వ్యక్తుల వివరాలు, అక్కడి పరిస్థితులు కాస్త చెపుదామని నా ఉద్దేశం. యుపిలో తెరాయి ప్రాంతం చాలా సారవంతమైన ప్రాంతం. మొత్తం యుపిలోనే అతి పెద్ద జిల్లా అయిన లఖ్కింపూర్ ఖేరీ అక్కడే వుంది. అక్కడ దేశవిభజనానంతరం వలస వచ్చిన శిఖ్కు రైతులు లక్షమంది వుండడంతో దాన్ని మినీ పంజాబ్ అంటారు. వాళ్లు చెఱుకు పండిస్తారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో కూడా శిఖ్కులు పెద్ద సంఖ్యలోనే వున్నారు. ప్రదర్శనకారుల్లో సహజంగా వాళ్లే ఎక్కువమంది ఉన్నారు.
వాళ్లపై నుంచి కారు పోనిచ్చేసిన అశీష్ మిశ్రా (మోనూ భయ్యా అని అతని ముద్దుపేరు) కుటుంబం గురించి కాస్త తెలుసుకోవాలి. అతని తాత అంబికా ప్రసాద్ కాన్పూరు నుంచి యిక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు డబ్బు అప్పిచ్చి, వంటపాత్రలు అరువిచ్చి స్థానికుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కొడుకు, అశీష్ తండ్రి ఐన అజయ్ 1960లో పుట్టాడు. బియస్సీ, ఎల్‌ఎల్‌బి చదివాడు. ప్రాక్టీసు చేయలేదు. ఊరికి వచ్చి తన పొలాల్లో వ్యవసాయం చేస్తూ రైసు మిల్లు నడిపేవాడు. అంబికా ప్రసాద్, కొడుకు చట్టవిరుద్ధమైన పనులు కూడా చేసేవారని ప్రతీతి. ఔషధాల్లో ఉపయోగించే కవిరి చెట్లు అక్కడ బాగా పండుతాయి. దాన్ని, చందనాన్ని, కెమికల్స్‌ని, ధాన్యాన్ని కూడా పక్కనే ఉన్న నేపాల్‌కు స్మగుల్ చేసేవారు. అజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, 2000 నుంచి 2005 వరకు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుకు వైస్ ప్రెసిడెంటుగా వున్నాడు. 2005 నుంచి 2010 వరకు ఖేరీ జిల్లా పంచాయితీలో సభ్యుడిగా వున్నాడు. 2012లో జిల్లాలోని నిఘాశన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ జిల్లాలో నెగ్గిన బిజెపి ఎమ్మెల్యే అతనొక్కడే.
2014లో పార్లమెంటుకు పోటీ చేసి నెగ్గాడు. ఈ గెలుపూ విశేషమే. ఆ నియోజకవర్గంలో 12శాతం మంది బ్రాహ్మణులు వున్నా చాలాకాలంగా కూర్మీ అనే ఒబిసి వర్గానికి చెందినవారే ఎంపీలుగా నెగ్గుతూ వచ్చారు. అక్కణ్నుంచి నెగ్గిన బ్రాహ్మణుడు యితనొక్కడే. ఆ తర్వాతి 2019 ఎన్నికలలో ఎస్పీ-బియస్పీ సమర్థించిన అభ్యర్థిపై 20శాతం ఓట్ల తేడాతో విజయం సాధించాడు. జులైలో కేంద్ర మంత్రిగా ఎంపికయ్యాడు. ఎన్నికలు రాబోతున్న యుపి బ్రాహ్మణులు బిజెపిపై ఆగ్రహంగా వున్నారన్న వార్తలు రావడంతో బిజెపి అధిష్టానం యుపి నుంచి ఆరుగురు ఒబిసి, దళిత ఎంపీలను తీసుకుంటూ వారితో బాటు బ్రాహ్మణుడైన యితన్ని కూడా తీసుకుంది. అతన్ని ఆ ప్రాంతంలో ‘తేనీ మహరాజ్’ అని పిలుస్తారు. అయితే మహారాజు మంచిమారాజేమీ కాదు. నేరచరిత్ర ఉన్నవాడే!
1990లోనే, అంటే అతనికి 30 ఏళ్ల వయసున్నపుడే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1996లో అతనిపై పోలీసు స్టేషన్‌లో హిస్టరీ షీటు తెరిచారు. కొన్ని నెలల తర్వాత మూసివేశారు. 2000 సం.లో జిల్లా బ్యాంకులో వైస్ ప్రెసిడెంటుగా వున్న రోజుల్లో రాజకీయ ప్రత్యర్థి అయిన ప్రభాత్ గుప్తా అనే ఎస్పీ కార్యకర్తను కాల్చి చంపాడని పోలీసులు పెట్టిన కేసులో యితనే ప్రధాన నిందితుడు. విచారణ సమయంలో ఎవరో యితనిపై కాల్పులు కాల్చాడు. సెషన్స్ కోర్టు 2004లో యితన్ని విడిచి పెట్టింది. హతుడి సోదరుడు అలహాబాద్ హైకోర్టుకి వెళ్లాడు. అక్కడ కేసు నత్తనడక నడుస్తోంది. చివరిసారి హియరింగ్ 2019 ఫిబ్రవరిలో అయింది. ఇలాటివాణ్ని కేంద్ర హోం శాఖలో సహాయమంత్రిని చేశారు. ఆ మాటకొస్తే హోం మంత్రి అమిత్ షాపై కూడా కేసులకు కొదవ లేదు.
అజయ్ ప్రత్యేకత ఏమిటంటే రౌడీయిజం యిప్పటికీ తగ్గలేదు. ఇప్పటికీ దర్బారు నిర్వహించి, తగాదాలు పరిష్కరిస్తూ వుంటాడు. అగ్రవర్ణ హిందువులు, ముస్లిములు ఆ దర్బారుకి వచ్చి అతని ఆదేశాలు శిరసా వహిస్తారు కానీ భూస్వాములైన శిఖ్కులు మాత్రం అతని అథారిటీని గుర్తించరు. అందువలన అతనికి వాళ్ల మీద గుర్రు. ఇప్పుడీ గొడవ రావడంతో తన తడాఖా చూపిద్దామనుకున్నాడు. ‘పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు వరిని క్వింటాల్ రూ. 1900 యిచ్చి కొంటూండగా, యుపి ప్రభుత్వం రూ.1100 మాత్రమే యిస్తోందెందుకు?’ అని ప్రశ్నిస్తూ ప్రదర్శన చేపట్టిన రైతులను ఉద్దేశించి ఈ సెప్టెంబరు 25న ప్రసంగిస్తూ ‘‘మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చడానికి నాకు రెండు నిమిషాలు పట్టదు. కావాలంటే ఎమ్మెల్యే కావడానికి ముందు నా చరిత్ర చూసుకోండి. నన్ను ఎదిరిస్తే బెదిరేవాణ్ని కాను.’’ అని హుంకరించాడు. అంతకు ముందే మీ అందర్నీ జిల్లా నుంచి తరిమేస్తాను జాగ్రత్త అని హెచ్చరించాడు. అందుకే రైతులు అతనికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రదర్శనకు దిగారు.
ఆ రోజే ఎంచుకోవడానికి కారణమేమిటంటే అజయ్ తన తండ్రి అంబికా ప్రసాద్ జ్ఞాపకార్థం ప్రతీ గాంధీ జయంతి నాడు సొంతగ్రామం బన్వీర్‌పూర్‌లో మహారాజా ఉగ్రసేన్ కాలేజీలో కుస్తీ పోటీలు నిర్వహిస్తాడు. దానికి యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యని ఆహ్వానించాడు. ఆయన అక్టోబరు 2 నాకు కుదరదనడంతో, అక్టోబరు 3కి కార్యక్రమం మార్చారు. ఆ కార్యక్రమానికి ఆటంకం కలిగించడానికి రైతులు కాలేజీ దగ్గర నల్లజండాల ప్రదర్శన చేయసాగారు. హెలికాప్టరులో అక్కడ దిగాలనుకున్న మౌర్య విధిలేక రోడ్డు మార్గాన రాసాగాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి అశీష్ బయలుదేరాడు. వెళ్లే దారిలో రైతుల రాస్తా రోకో అడ్డు తగలడంతో అశీష్‌కు అహం పొడుకుని వచ్చింది. అతను వచ్చే ఎన్నికలలో తండ్రి గతంలో ఎమ్మెల్యేగా నెగ్గిన నిఘాశన్ నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నాడు. తనెంతటి ఘటికుడో చూపించుకోవాలంటే యిదే సందర్భం.
అందుకని ‘నా కార్యక్రమాన్ని అడ్డుకునేటంత మొనగాళ్లా మీరు? నా తడాఖా చూపిస్తా చూడండి’ అంటూ రోడ్డు మీద కూర్చున్నవాళ్ల మీద నుంచి తన మూడు కార్ల కాన్వాయ్‌ను పోనిచ్చేడు. జనం మధ్యలోకి వచ్చాక కారు అడ్డదిడ్డంగా పోనిచ్చి, ఆందోళనకారులను భయభ్రాంతులను చేశాడు. 20 మంది రైతులను ఒకేసారి గుద్దడంతో అది బోల్తాపడింది. అశీష్ కాల్పులు జరిపాడు కూడా. మొత్తం మీద నలుగురు రైతులు చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దానికి ప్రతీకారంగా ప్రదర్శనకారులు ఆ వాహనాల్లో వున్న ముగ్గుర్ని చితకబాది చంపేశారు. వారితో బాటు ఉన్న స్థానిక టీవీ విలేఖరి కూడా చచ్చిపోయాడు. అతని చావుకి కారణం బుల్లెట్ గాయమా లేక దెబ్బలా అనేది యింకా తెలియదు.
ఈ సంఘటన తర్వాత అశీష్ తర్వాత అక్కణ్నుంచి పారిపోయాడు. అతను జరిపిన హత్యాకాండ వార్త బయటకు రాగానే తండ్రి అజయ్ మిశ్రా వెంటనే ఖండన విడుదల చేశాడు. ‘మా అబ్బాయి అక్కడ లేనే లేడు, నాలుగు కిలోమీటర్ల దూరంగా కుస్తీ పోటీ జరగాల్సిన బన్వీర్‌పూర్‌లో మా ఫామ్‌హౌస్‌లో వున్నాడు’ అన్నాడు. అది అతను చేసిన తప్పు. నిజానికి కొడుకు చేసిన నేరానికి బాధ్యత తండ్రిది కాదు. శిక్ష కొడుక్కే పడాలి. కానీ హోం శాఖలో సహాయమంత్రిగా వున్న అజయ్, పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కొడుకు ఓ పట్టాన లొంగిపోకుండా కాపాడాడు. కారు నడిపినది డ్రైవరన్నాడు. నడిపినది డ్రైవర్ కాదు, అశీషేనని కెమెరాలు సాక్ష్యం చెప్పేయడంతో, సెల్‌ఫోన్ సిగ్నల్స్ సహాయంతో నేరసమయంలో అశీష్ ఎక్కడున్నాడో నిర్ధారించగలగడంతో, చివరకు అక్టోబరు 9న సిట్‌కు లొంగిపోవలసి వచ్చింది, అది కూడా కోర్టు యుపి ప్రభుత్వానికి గట్టిగా క్లాసు తీసుకున్న తర్వాత!
నేరానికి సహకరించాడన్న అభియోగం రావడం చేత అజయ్‌ను కాబినెట్‌లో నుంచి బర్తరఫ్ చేయాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మీటూ కేసులో కేవలం ఆరోపణ మీదనే ఎంజె అక్బర్ చేత రాజీనామా చేయించిన మోదీ, అజయ్ విషయంలో అబద్ధాలాడేడని నిరూపణ అయినా చర్య తీసుకోవడం లేదు. రైతుల డిమాండ్లలో అది నెరవేరలేదు. ఎందుకంటే యుపి ఎన్నికలలో బ్రాహ్మణ ఓటు కీలకమైనది. నేరస్తుడైన యీ బ్రాహ్మణున్ని శిక్షిస్తే యుపిలోని యావత్తు బ్రాహ్మణులు కోపిస్తారని వారి భయం అనుకోవాలా? ఇలాటి కులరాజకీయాల గురించి అందరూ సిగ్గుపడాలి. అంతగా కావాలంటే అజయ్‌ను తీసేసి, మరో బ్రాహ్మణున్ని మంత్రిగా వేసుకోవచ్చు కదా! అలా చేసినా తమ స్ట్రాంగ్‌మ్యాన్ యిమేజికి భంగం కలుగుతుందని ఎవరైనా చెప్పారా? బిజెపి కార్యకర్తలు ‘ప్రదర్శనకారులు ఖలీస్తానీలు, కొందరు భింద్రన్‌వాలే బొమ్మ ఉన్న టీషర్టులు వేసుకున్నారు’ అనే ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని హిందు-శిఖ్కు గొడవగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు.
అశీష్ ఒక్కణ్నీ తప్పుపడితే లాభం లేదు. యుపి ప్రభుత్వ ప్రవర్తన కోర్టు అభిశంసనకు మాటిమాటికి గురైంది. సంఘటన జరగగానే దాని తాలూకు వీడియోలు వాట్సాప్‌లలో వీరవిహారం చేయకుండా అక్కడ ఇంటర్‌నెట్ కట్ చేశారు కానీ, 48 గంటలవరకు పోలీసు విచారణ ప్రారంభించలేదు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు మూడో రోజున మాత్రమే అక్కడకు చేరారు. ‘వర్షం వచ్చింది కాబట్టి రాలేకపోయాం’ అని సాకు చెప్పారు. వర్షం కొద్దిగానే పడినా రక్తపు మరకలు చెరిగిపోయాయి. వాహనాలకు మంట పెట్టడంతో వేలిముద్రలు ముందే పోయాయి. కాలిపోయిన జీపులో రెండు తూటాలు దొరికాయి. వేలాది మంది ఎదుట యీ ఘటన జరిగితే కేవలం 23 మంది మాత్రమే సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారని, వారి స్టేటుమెంట్లే రికార్డు చేశామని యుపి పోలీసులు అనడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఏం చేసినా రైతుల్లోనే కాక, దేశప్రజల్లో కూడా యుపి ప్రభుత్వతీరుపై ఏహ్యత పుట్టింది. యుపి పోలీసులు అజయ్ చేసిన ఘోరం కేసును, రైతుల ప్రతిక్రియలో హతులైన యిద్దరు బిజెపి వర్కర్ల కేసును కలగాపులగం చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. బిజెపిపై సానుభూతి పోయింది. చివరకు పరిస్థితి ఎలా వచ్చిందంటే మృతులైన రైతుల కుటుంబాలకు యిచ్చే నష్టపరిహారాన్ని (చనిపోయిన వారికి రూ.45 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి రూ.10 లక్షలు) ఘనంగా ప్రకటించుకున్న యుపి ప్రభుత్వం బిజెపి కార్యకర్తల కుటుంబాలకు యిచ్చిన నష్టపరిహారాన్ని బయటకు చెప్పకుండా చెక్కులను వాళ్ల యిళ్లకు పంపేసింది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్ లలోని కాంగ్రెసు ప్రభుత్వాలు రూ.50 లక్షల అదనపు నష్టపరిహారాన్ని రైతు కుటుంబాలకు యిచ్చాయి కానీ బిజెపి కార్యకర్తల కుటుంబాలకు యివ్వలేదు.
అశీష్‌కు శిక్ష పడుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. అక్టోబరు 24న అతనికి డెంగ్యూ వచ్చిందంటూ ఆసుపత్రిలో చేర్చారు. నెల్లాళ్ల క్రితం అతను లఖ్కింపూర్ ఊళ్లో హాయిగా తిరుగుతున్నట్లు వీడియో వైరల్ అయింది. అంతా గగ్గోలు పెడితే మళ్లీ జైలుకి పంపించి చికిత్స చేయిస్తున్నామన్నారు. కేసు విచారిస్తున్న సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డిఐజి ఉపేంద్ర కుమార్ అగర్వాల్‌ను అక్టోబరు 22న యుపి ప్రభుత్వం అక్కణ్నుంచి బదిలీ చేసేసింది. ఇదెక్కడి ఘోరమని అందరూ అంటే ‘అది రొటీన్ ట్రాన్స్‌ఫరే, 200 కి.మీ.ల దూరంలో వున్న ఊరికి వెళ్లినా సిట్ బాధ్యత నుంచి తప్పించలేదు.’ అంటోంది ప్రభుత్వం. స్థానికంగా వుంటే సాక్షులను కాపాడవచ్చు, వేరే చోట ఉంటే రక్షణ ఏమివ్వగలరు? ఇప్పటికే సాక్షుల్లో 8 మంది తమకు పోలీసు సెక్యూరిటీ అక్కరలేదని రాసి యిచ్చారంటే దాన్ని బట్టి పోలీసులు ఎలాటి ఒత్తిడి తెస్తున్నారో ఊహించవచ్చు. ఇలాటి పరిస్థితుల్లో విచారణ ఎంత లక్షణంగా సాగుతుందో దేవుడికే తెలియాలి. (ఫోటో – అశీష్, అజయ్ మిశ్రాలు, ఘటనాస్థలి)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)