తగ్గించిన టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచిస్తుందా? కొందరు సినీ పెద్దలు జరిపిన చర్చలు కొలిక్కి వస్తున్నాయా? మంత్రి పేర్ని నాని టాలీవుడ్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..? రెండు పెద్ద సినిమాలకు సంబంధించి ఈరోజు జరిగిన 2 ఈవెంట్స్ లో టికెట్ రేట్ల అంశం ప్రస్తావనకొచ్చింది. రెండు సినిమా యూనిట్లు చాలా సానుకూలంగా స్పందించడం, ఇంకా ఆశ ఉందని చెప్పడం కొసమెరుపు.
ముందుగా పుష్ప విషయానికొద్దాం.. ఈనెలలోనే విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తగ్గించిన టికెట్ రేట్లపై స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంతా అనుసరించాల్సిందేనని ప్రకటించిన నిర్మాతలు.. తమకింకా ఆశాభావం ఉందని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల పుష్ప వసూళ్లపై ఆ ప్రభావం ఉంటుందని అంగీకరించారు ప్రొడ్యూసర్లు.
ఇక ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కూడా దాదాపు ఇలానే రెస్పాండ్ అయ్యారు. బెంగళూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో టికెట్ రేట్లు అంశంపై దానయ్య మాట్లాడారు. టికెట్ రేట్లు తగ్గించిన ప్రభావం కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉంటుందని.. ఇప్పటికీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ప్రకటించారు. అదనపు ఆటలకు, ఫ్లెక్సీ రేట్లకు ట్రై చేస్తున్నట్టు తెలిపారు దానయ్య.
పుష్ప సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతోంది. ఈలోగా ఏపీ సర్కార్ నుంచి టికెట్ రేట్లపై నిర్మాతలకు అనుకూలంగా ప్రకటన వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మరోవైపు ఏపీలో తాజాగా వచ్చిన వరదలపై స్పందించి, చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఈ చర్యతో జగన్ మనసు మారుతుందని భావిస్తున్నారు. ఫ్రెష్ గా మరోసారి మంత్రితో చర్చలు ప్రారంభించారు. మరి జగన్ మనసులో ఏముందో..!