శివసేన పార్టీ పేరు, గుర్తు.. ఇవన్నీ షిండే వర్గానికే దక్కుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించిన వైనం ఠాక్రేల రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయంపై ఠాక్రేల ముద్ర అంతా ఇంతాకాదు! ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, లేకపోయిన శివసేన .. మరాఠ వాదంతో తన ఉనికిని చాటుకుంటూ ఉంది.
బాల్ ఠాక్రే హయాం తర్వాత కూడా శివసేన ఉనికికి ఇబ్బంది రాలేదు. వారసత్వ పోరుతో రాజ్ ఠాక్రే కొత్త పార్టీని ఏర్పాటు చేసినా.. శివసేనే ప్రధానంగా నిలిచింది. బాల్ ఠాక్రే అనంతరం కూడా బీజేపీతో దోస్తీని కొనసాగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే తన పట్టును నిలుపుకున్నారు.
అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఆయన ఆశ బీజేపీకి కంటగింపుగా మారింది. తమ జూనియర్ పార్ట్ నర్ గా ఉండాలి తప్ప, అలాంటి ఆశలు పెట్టుకోలేదని కమలం పార్టీ సందేశం ఇచ్చింది. అందుకు నిదర్శనాల్లో ఒకటి.. షిండే వర్గం తిరుగుబాటు. బీజేపీ ప్రేరేపిత తిరుగుబాటే అది అనే విషయం తెలియని వారు ఎవ్వరూ లేరు! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుగా, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అనుకుని తన మాట వినని శివసేనలో తిరుగుబాటు తీసుకురావడం కానీ, తిరుగుబాటు వర్గానికే గుర్తింపు దక్కడం కానీ పెద్ద విచిత్రాలు ఏమీ కావు!
బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ లో దాదాపు ఇదే జరిగింది. తిరుగుబాటు వర్గం బీజేపీకి అనుకూలంగా, అధికారిక వర్గంగా మారింది. బీజేపీ పంచనే ఉన్నా చిరాగ్ ను మాత్రం కమలం పార్టీ పట్టించుకోలేదు! అలాంటిది ఎదురుతిరిగిన ఠాక్రేని బీజేపీ అధిష్టానం సహిస్తుందా?
ఇదంతా జరిగిన కథ. మరి ఇప్పుడు ఠాక్రే పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీని కోల్పోయిన ఎన్టీఆర్ లా ఈయన ఆక్రోశం వెల్లగక్కడంతో ఆగిపోతారా ? లేక పార్టీ, గుర్తును బలవంతంగా లాక్కొన్నారని ప్రజల మధ్యకు వెళ్తారా? అనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం.
ప్రస్తుత పరిస్థితుల్లో.. ఠాక్రే వెంట ఇప్పటి వరకూ నిలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉండరని అంటోంది బీజేపీ. ఆయన వెంట ఉన్న వారు కూడా షిండే వర్గంలో చేరిపోవచ్చని, తద్వారా బీజేపీ భయభక్తులు కావొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. అతి పరిమిత వర్గంలో ఠాక్రే మిగిలిపోవచ్చు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. అయితే బీజేపీ తన దయాదక్షిణ్యాల మీద చివరకు ఠాక్రేతో రాజీ కుదుర్చుకోవచ్చనే విశ్లేషణలూ ఉన్నాయి.
తమ మాట వింటానంటే.. షిండే లాంటి ఆటబొమ్మను పక్కన పెట్టడం, మళ్లీ ఉద్ధవ్ ను టక్కున చేర్చుకోవడం బీజేపీకేమీ కష్టం కాదు! మరి పార్టీని, గుర్తును కోల్పోయిన పరిస్థితుల్లో ఉద్ధవ్ అలాంటి రాజీ పడతారా? లేక ఈ రాజకీయం చూడండంటూ ప్రజల మధ్యకు వెళ్లి బీజేపీని ఎండగట్టే సాహసం చేస్తారా? అనేది మహారాష్ట్ర రాజకీయంలో చెప్పుకోదగిన అధ్యాయం కాబోతోంది!