అతడో ఖైదీ. జైలులో ఉన్నాడు. ఎలాగోలా బయటనుంచి ఓ సెల్ ఫోన్ తెప్పించుకున్నాడు. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులతో స్నేహితులతో మాట్లాడేవాడు. తర్వాత జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకునేవాడు. ఓరోజు జైలులో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయనే వార్త గుప్పుమంది. పోలీస్ అధికారులు ప్రత్యేకంగా జైలుని తనిఖీ చేస్తున్నారు.
ఆ ఖైదీకి ఏం చేయాలో పాలుపోలేదు. మరికాసేపట్లో తన గదికే వచ్చి పోలీసులు చెక్ చేస్తారని తేలిపోయింది. పోలీసులకు దొరికితే అది మరో కేసవుతుంది, ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడరనే ఆరాలు కూడా తీస్తారు. ఇదంతా ఎందుకని టెన్షన్ లో సెల్ ఫోన్ మింగేశాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్ కనపడలేదు కానీ, సాయంత్రానికి ఆ ఖైదీకి కడుపునొప్పి మొదలైంది. కడుపులో ఉన్న సెల్ ఫోన్ కుదురుగా ఉండనీయలేదు. దీంతో కడుపునొప్పి అంటూ విలవిల్లాడుతుంటే పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. తీరా ఎక్స్ ర్ లో అసలు విషయం బయటపడింది. కడుపులో ఫోన్ ఉన్నట్టు తేలింది. దీంతో జైలు సిబ్బంది షాకయ్యారు, ఆ ఖైదీ తన ప్రాణాలు కాపాడండి అంటూ వైద్యులను వేడుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో ఈ ఘటన జరిగింది. జనవరి 17, 2020న హాజియాపూర్ గ్రామ సమీపంలో నార్కోటిక్ పదార్ధాలతో పట్టుబడిన కైషర్ అలీ మూడేళ్లుగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. చివరకు సెల్ ఫోన్ మింగేసి ఆస్పత్రిలో చేరాడు.
గతంలో తీహార్ జైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వైద్యులు ఆపరేషన్ చేసి సెల్ ఫోన్ బయటకు తీశారు. ఇప్పుడు కైషర్ కి కూడా ఆపరేషన్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పీఎంసీహెచ్ పాట్నాకు రెఫర్ చేస్తామని చెప్పారు వైద్యులు.