వైసీపీలో చేర‌లేదు…ఎమ్మెల్సీగా ఖ‌రారు!

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ సిపాయి సుబ్ర‌మ‌ణ్యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈయ‌న అభ్య‌ర్థిత్వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది. రెండు తెలుగు…

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ సిపాయి సుబ్ర‌మ‌ణ్యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈయ‌న అభ్య‌ర్థిత్వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థ‌లు, ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల‌కు వ‌చ్చే నెల‌లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి చిత్తూరు విష‌యానికి వ‌స్తే డాక్ట‌ర్ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. ఈయ‌న నాలుగు రోజుల క్రితం టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అంత వ‌ర‌కూ టీడీపీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌ణ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభ స‌భ‌లో వేదిక‌పై లోకేశ్ ప‌క్క‌నే ఈయ‌న క‌నిపించారు. లోకేశ్ పాద‌యాత్ర‌లో టీడీపీ వైపు వైసీపీ నుంచి వ‌స్తార‌నుకుంటే… ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో మాత్రం రివ‌ర్స్ అయ్యింది.

ఈయ‌న వ‌న్నెకుల క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. చిత్తూరు జిల్లాలో ప‌ల్లెరెడ్లు అని పిలుస్తారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని శ్రీ‌కాళ‌హ‌స్తి, చంద్ర‌గిరి, న‌గ‌రి, స‌త్య‌వేడు, కుప్పం, జీడీనెల్లూరు, చిత్తూరు, ప‌ల‌మ‌నేరుతో పాటు వెంక‌గిరి నియోజ‌క వ‌ర్గాల్లో ఈ సామాజిక వ‌ర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపి సిపాయికి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. 2009లో శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి ప్ర‌జారాజ్యం త‌ర‌పున ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు.

చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాల‌నే ఆయ‌న కోరిక‌ను జ‌గ‌న్ నెర‌వేర్చ‌నున్నారు. బ‌హుశా పార్టీ కండువా క‌ప్పి, ఎమ్మెల్సీ ప‌ద‌విని బోన‌స్‌గా ఇవ్వ‌నున్నార‌ని వైసీపీ పెద్ద‌లు చెబుతున్నారు. తిరుప‌తిలో యురాల‌జీ విభాగంలో ప్ర‌ముఖ వైద్య నిపుణులుగా పేరు ఉంది. ర‌ష్ ఆస్ప‌త్రి అధినేత‌గా పార్టీల‌కు అతీతంగా స్నేహ‌సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. ఈయ‌న చేరిక‌తో చిత్తూరు జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ న‌మ్ముతోంది.