సాధారణంగా ఎన్నికల తొలి రౌండ్లు ఫలితాలు చూసి ఓడెదెవరో గెలిచేదెవరో అంచనాకు వస్తారు. అంతవరకూ ఎవరైనా గట్టిగానే పోరాడుతారు. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ విషయంలో మాత్రం గతంలో లేని వింతలు అన్నీ ఇపుడు కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచే వైసీపీ మీద విపక్షాలు యాగీ చేయడం మొదలెట్టాయి.
అనర్హులను పట్టభద్రులుగా చేస్తున్నారు అని ఆరోపించారు. దాని మీద అధికారులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. అంతా ఓకే అనుకున్న తరువాతనే ఆ రాజకీయం ఆగింది. వచ్చే నెల 13న ఎన్నికలు అంటూ షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికల వేడి పెరిగింది.
ఇపుడు అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీసీ తన పలుకుబడి ఉపయోగించి మొత్తం ఓట్లను వైసీపీ వైపుగా పడేలా మంత్రాంగం చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు కోసం వైసీపీ ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశం మీద విపక్షాలు అనుమానంతో ఈ తరహా విమర్శలు చేస్తున్నాయి. దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ తమ మీటింగ్ మీద నిఘా వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ మీటింగుకి తెల్ల చొక్కా వేసుకుని ఎవరు వచ్చినా అనుమానిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాము నిబంధలన ప్రకారమే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, ఆ మీదట ఏది జరిగినా ఈసీ చూసుకుంటుందని అంటున్నారు. విపక్షాలు మాత్రం అధికార పార్టీ పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోందని, అందుకే అనేక రకాలుగా కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తూంటే అధికార పక్షం గెలుపు ఖాయమని విపక్షాలు ముందే డిక్లేర్ చేస్తున్నాయా అన్న డౌట్లు వస్తున్నాయి. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే విపక్షాలు వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఫలితాల కంటే ముందే తీర్పు విపక్షాలకు తెలిసిపోతోందా అని సెటైర్లు వేస్తున్నారు.
గతంలో రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేవి. ఇపుడు ప్రధాన పార్టీలు రంగంలో ఉండడంతో వేడి రాజుకుంటోంది. ఈసారి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయన్నది కూడా ఆసక్తిని కలిగిస్తోంది.