జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేతలు తరచూ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. తనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తే… చెప్పుతో కొడ్తానని ఆ మధ్య పవన్‌కల్యాణ్ చేతిలోకి చెప్పు తీసుకుని మరీ హెచ్చరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇవాళ తన వీకెండ్ కామెంట్లో జర్నలిస్ట్ & ఓనర్ అయిన ఆర్కే తన మార్క్ వ్యాఖ్యలు చేశారు.
‘వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదు, నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి’ అని పవన్ వద్దకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూతలను పంపినట్టు ఆర్కే రాసుకొచ్చారు. చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్‌ను దూరం చేసి, మరోసారి జగన్ అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగమే ఇదంతా అని ఆర్కే రాతల సారాంశం. తనపై చంద్రబాబు అనుకూల మీడియాధిపతి సంచలన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తే… కనీసం స్పందించాలన్న స్పృహ పవన్‌కు లేకపోయింది.
అలాగే ఈ వ్యాఖ్యల్ని జనసేన ఖండించకపోవడం గమనార్హం. దీంతో ఇలాంటి ప్రచారాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ కోరుకుంటున్నారని భావించాల్సి వుంటుంది. ఇదే జగన్‌పై ఆరోపణలు చేయడానికి మాత్రం పవన్‌కల్యాణ్ ముందు వరుసలో వుంటారు. అసలే ప్యాకేజీ స్టార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్‌కల్యాణ్… తాజా ఆర్కే కామెంట్స్‌తో వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే అని నమ్మే పరిస్థితికి దారి తీస్తాయి.
ఆర్కే వెయ్యి కోట్ల ఆఫర్ రాతలపై పవన్ అన్న, జనసేన కీలక నాయకుడు నాగబాబు కూడా స్పందించకపోవడం గమనార్హం. అలాగే మరో ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ మౌనాన్ని ఆశ్రయించడం దేనికి సంకేతం? టీడీపీకి చెందిన పత్రికలో పవన్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వార్తలొస్తే, దాని వెనుక చంద్రబాబు ఎత్తుగడ ఏమైనా వుందా? అనే ఆలోచన పవన్‌కల్యాణ్ ఆలోచిస్తున్నారా? లేదా? పవన్‌ను రాజకీయంగా బద్నాం చేసే ఇలాంటి రాతలపై మౌనంగా వుంటే… భవిష్యత్‌లో జరగబోయే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. కనీసం ఈ విషయాన్నైనా జనసేనాని, ఆ పార్టీ నాయకులు గుర్తిస్తే మంచిది.