జ్ఞానేంద్రియాలన్నీ ముఖ్యమైనవే అయినా అందులో కొన్నిటికే మనం ప్రయారిటీ ఇస్తుంటాం. ముఖ్యంగా కళ్లకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తాం. కంటిచూపు మందగిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకెళ్తాం. రకరకాల కళ్లజోళ్లు, వెరైటీ కళ్లద్దాలతో అందానికి కూడా మెరుగులద్దుతాం. అయితే చెవుల విషయానికొస్తే, వారానికోసారి ఇయర్ బడ్స్ చెవిలో పెట్టి తిప్పేస్తాం కానీ, ఆ తర్వాత పట్టించుకోం. వినికిడి శక్తి మందగిస్తున్నా కూడా డాక్టర్ల దగ్గరకు పరిగెత్తుకెళ్లేవారు అరుదు. చెవులను కూడా పట్టించుకుంటేనే అవి మనం చెప్పినట్టు వింటాయని అంటున్నారు నిపుణులు. చెవులకోసం ఈ 5 పనులు చేయండి చాలంటున్నారు.
1. చలిగాలితో జాగ్రత్త..
చెవులకు చలిగాలి తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కేవలం చలి నుంచి రక్షించుకోడానికే కాదు, చెవుల ఆరోగ్యానికి కూడా ఇది మంచిదని అంటున్నారు. చెవులలోకి చలిగాలి వెళ్తే, లోపల సున్నితంగా ఉండే పొరలు దెబ్బతింటాయని అంటున్నారు. ఫలితంగా చెవి సమస్యలతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.
2. ఇయర్ బడ్స్..
చిన్నప్పుడు తలస్నానం చేయించిన తర్వాత పిల్లలకు చెవిలో పొడిబట్టను పెట్టి తిప్పుతారు. చెవిలో ఉండే గుబిలి, తేమను బయటకు లాగే ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్లు. ఇప్పుడంతా ఇయర్ బడ్స్ దే ట్రెండ్. అయితే ఇయర్ బడ్స్ ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే వాటితో వినికిడి శక్తికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. చెవిలో నూలు గుడ్డను పెట్టి శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు.
3. ఎక్కువ సౌండ్ వద్దు..
చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్ లు, పెద్ద పెద్ద శబ్ధాలు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. కానీ వీటివల్ల త్వరగా వినికిడి శక్తి కోల్పోతామని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వినేటప్పుడు హాయిగానే ఉన్నా దీర్ఘకాలికంగా వీటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎక్కువ శబ్దాలున్న చోటకు వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వెళ్లాల్సిన అవసరం వచ్చినా కూడా ఎక్కువసేపు ఆ శబ్దాల దగ్గర ఉండకపోవడం మంచిదంటున్నారు.
4. ప్రయాణాల సమయంలో..
ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే సమయంలో చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతున్నారు వైద్యులు. చెవులపై ఒకేరకమైన ఒత్తిడి ఉండేలా చ్యూయింగ్ గమ్ లు నమలడమో అప్పుడప్పుడూ ఆవలించడమో చేయాలంటున్నారు. విమాన ప్రయాణాల్లో వాతావరణ పీడనం ఒకేరకంగా ఉండదు కాబట్టి, చెవులపై ఆ ప్రభావం కనిపించే అవకాశముంది.
5. చెవిలో నువ్వులనూనె..
చెవిని శుభ్రం చేసుకోవాలనుకుంటే రాత్రి పడుకునే ముందు చెవిలో రెండు చుక్కల నువ్వులనూనె వేయాలని సలహా ఇస్తున్నారు వైద్యులు.
చెవులలో పెన్నులు, పిన్నీసులు, కోడి ఈకలు పెట్టి తిప్పుకోవడం సరదాగానే ఉన్నా.. అలాంటి పనులు చేసేవారు వాటి ఫలితాలు అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.