రాఘ‌వ లారెన్స్..వివాదానికి తెర‌దించే య‌త్నం!

జ‌నాలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ప్ర‌త్యేకించి సినీ హీరోల వీరాభిమానులు అయితే.. మ‌రీ దారుణంగా త‌యార‌య్యారు. తాము ఫ‌లానా హీరోకి ఫ్యాన్స్ అంటూ వీరంగం చేసే జ‌నాల్లో చాలా మందికి కామ‌న్ సెన్స్…

జ‌నాలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ప్ర‌త్యేకించి సినీ హీరోల వీరాభిమానులు అయితే.. మ‌రీ దారుణంగా త‌యార‌య్యారు. తాము ఫ‌లానా హీరోకి ఫ్యాన్స్ అంటూ వీరంగం చేసే జ‌నాల్లో చాలా మందికి కామ‌న్ సెన్స్ ఉండ‌ద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు కూడా. అభిమానం ఉండొచ్చు, కానీ దురాభిమానులే సినీ హీరోల‌కు ఎక్కువ‌.

త‌న చిన్న‌త‌నంలో చేసిన ఏదో అల్ల‌రి ప‌ని గురించి చెప్ప‌డ‌మే లారెన్స్ త‌ప్ప‌యిపోయింది. త‌ను చిన్న‌ప్పుడు అమాంబాప‌తు ప‌నులు చేసిన‌ట్టుగా, క‌మ‌ల్ హాస‌న్ సినిమా పోస్ట‌ర్ల మీద పేడ విసిరిన‌ట్టుగా లారెన్స్ చెప్పుకున్నాడు. ర‌జ‌నీకాంత్ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మంలో ఆ మాట‌ను చెప్పాడు. ర‌జ‌నీ మీద ప్రేమ క‌మ‌ల్ మీద ద్వేషంగా ఉండేద‌ని.. ఆ త‌ర్వాత ర‌జ‌నీ, క‌మ‌ల్ ఇద్ద‌రి గొప్ప‌ద‌నాన్నీ అర్థం చేసుకున్న‌ట్టుగా లారెన్స్ చెప్పుకొచ్చాడు. సినీ హీరోలపై వీరాభిమానం ప్ర‌ద‌ర్శించే వ్య‌క్తే ఈ లారెన్స్ కూడా.

అయితే ఇత‌డి వీరాభిమానంపై క‌మ‌ల్ వీరాభిమానులు విరుచుకుప‌డ్డారు. లారెన్స్ మీద వారు దుమ్మెత్తిపోశారు. త‌ను చిన్న‌త‌నంలో ఏదో తెలీనిత‌నంలో చేసిన‌ట్టుగా చెప్పుకున్న ప‌ని విష‌యంలో లారెన్స్ ను వాళ్లు వాయించ‌సాగారు. త‌ను మాట్లాడిన మాట‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో డైరెక్టుగా క‌మ‌ల్ హాస‌న్ నే క‌లిశారు లారెన్స్.  త‌ద్వారా వివాదానికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేశాడు లారెన్స్. క‌మ‌ల్ తో ఫొటో దిగి దాన్ని పోస్టు చేసి త‌న‌కు క‌మ‌ల్ తో సాన్నిహిత్యం ఉంద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మరి ఇప్ప‌టికైనా క‌మ‌ల్ వీరాభిమానులు చ‌ల్లార‌తారా?