పవన్ కల్యాణ్ సమాజంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసి మరీ పార్టీ నుంచి బైటకొచ్చేశారు, జనసేన సిద్ధాంత కర్త, మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్. అయితే రెండు రోజులుగా ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే.. పవన్ వర్గంలో ఇంత కులపిచ్చి నాటుకుపోయి ఉందా, మతాన్ని కూడా ఇంత దారుణంగా వాడుకుంటారా అనిపించక మానదు.
పవన్ కల్యాణ్ ని రాజు రవితేజ విమర్శించడం వెనక క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావం ఉందని, కేవలం ఓ వర్గం వారిని సంతృప్తి పరిచేందుకే ఆయన జనసేన నుంచి బైటకెళ్లారని, ఆ వర్గం పవన్ ని ద్వేషిస్తోందని మండిపడుతున్నాయి కొన్ని వెబ్ సైట్లు. రవితేజ కి క్యాస్ట్ పాలిటిక్స్ ని ముడిపెట్టాయి, ఆయన వ్యాఖ్యల వెనక ఉన్న నిజానిజాలను బేరీజు వేసుకోవాల్సింది పోయి, మతం ముసుగేసి మంచివాడు కాదని రిమార్క్స్ ఇచ్చేస్తున్నాయి.
ఇలాంటి పిచ్చి రాతల వెనక పవన్ హస్తం ఉందని స్పష్టమవుతోంది. రాజీనామాను ఆమోదించే క్రమంలో కూడా ఆయన కుటుంబానికి మేలు జరగాలంటూ “జగన్మాత”ను ప్రార్థిస్తున్నాను అంటూ చేసిన స్పెషల్ మెన్షన్ కూడా ఇందులో భాగమేనంటున్నారు కొంతమంది.
వాస్తవానికి ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ ఓ వర్గాన్ని మరీ కించపరుస్తూ మాట్లాడటం అందరం గమనిస్తూనే ఉన్నాం. మతం మారితే నీకు రెడ్డి అనే పేరెందుకు, రెడ్డి అనే పేరు కావాలనుకున్నోడివి మతం మారడం ఎందుకు అంటూ ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి మాట్లాడారు పవన్ కల్యాణ్. మత మార్పిడులు జరగడం మంచిది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ఇల్లు ఎక్కడుంది? దానికి సమీపంలో కృష్ణా నదిలో మత మార్పిడి జరిగితే దానికి జగన్ ఎలా బాధ్యుడవుతారు? పోనీ జరిగిందే అనుకుందాం.. మతం మారకూడదని ఎక్కడా రాజ్యాంగంలో లేదు, ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉంది. అలాంటప్పుడు మత మార్పిడిలపై పవన్ ఎందుకింత ఆవేదన చెందుతున్నారో అర్థం కావడంలేదు. తన ముసుగు తీసేందుకు, బీజేపీతో రహస్య కాషాయ ఎజెండాను బైట పెట్టేందుకే పవన్ ఇలా ఉవ్విళ్లూరుతున్నారని అర్థమౌతోంది. ఇదే విషయాన్ని తన రాజీనామా లేఖలో రవితేజ్ వెల్లడించారు కూడా.
అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. తన స్నేహితుడు తనని వీడి వెళ్లిపోతున్న సమయంలో కూడా మతాన్ని, వర్గాన్ని పవన్ మహ బాగా వాడుకోవడం. కనీసం ఆయనపై అయినా పవన్ ఇలాంటి మత విద్వేషం చిమ్మకుండా ఉండాల్సింది. తన వారితో పిచ్చి రాతలు, పిచ్చి పోస్టింగ్ లు పెట్టించకుండా ఉండాల్సింది. పవన్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.