ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణ (నాయుడు) సీఎం సామాజిక వర్గమైన ‘రెడ్ల’ను టార్గెట్ చేశారు. గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు ‘రెడ్డి’ కాబట్టి ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా అంటూ మహిళా సంఘాల నేతలు అన్నారో లేదో తెలియదో కానీ…వారు ప్రశ్నించినట్టు తన పత్రికలో ప్రాధాన్యం ఇచ్చి నిన్న ప్రచురించారు. జగన్‌ను ఎవరేం విమర్శించినా ‘కులం’ కోణంలో ప్రచారం చేయడంలో ఇటీవల ఆంధ్రజ్యోతి ఒక పాలసీగా తీసుకున్నట్టుగా ఆ రాతలు తెలియజేస్తున్నాయి.
ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికను చూస్తే సీఎం సామాజికవర్గంపై దాడి కొనసాగింపు అర్థమవుతుంది. ‘రెడ్డి’ అంటే కేవలం జగన్‌మో హన్‌రెడ్డి మాత్రమే కాదని రాధాకృష్ణ గుర్తిస్తే మంచిది. ఎందుకంటే జగన్‌ను వ్యతిరేకించే ‘రెడ్డి’ సామాజిక వర్గం రాయలసీమలో గణనీయంగానే ఉంది. రాధాకృష్ణకు జగన్‌తో పేచీనా లేక ‘రెడ్ల’తోనా అనే విషయాన్ని ముందుగా స్పష్టం చేయాలి. జగన్‌కు అండగా నిలిచిందని ఆర్‌కే భావిస్తున్న‘రెడ్డి’సామాజికవర్గంపై ఆర్‌కే ఎంత అక్కసుగా ఉన్నారో ఆయన గారి కొత్తపలుకుతో పాటు ‘మనోడే మంచిపనోడుడి’ శీర్షికతో మెయిన్ బ్యానర్‌గా ప్రచురించిన వార్తా కథనాలను చదివితే అర్థమవుతుంది.
మొత్తం నియామకాలతో పోల్చితే ఇతర వర్గాలకు లభించిన పదవులు గరిష్ఠంగా 20 శాతానికి మించి ఉండవని, సీఎంతో మొదలుకుని ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు, పదవుల్లో సుమారు 300 మంది ఒకే సామాజిక వర్గం వారేనని ఆంధ్రజ్యోతి వార్తా కథనంగా రాసింది. దాన్ని అటుంచితే ప్రధానంగా ఆర్‌కే రాసిన కొత్త పలుకు గురించి చర్చిద్దాం.
కొత్త పలుకులో 29 సార్లు జగన్‌మోహన్‘రెడ్డి’, 12 సార్లు చంద్రబాబు(నాయుడు లేదు) ప్రస్తావన
‘ఇద్దరు ముఖ్యమంత్రుల ముచ్చట!’ శీర్షికతో ఆర్‌కే మార్క్ కొత్తపలుకు పలికారు. బ్రాడ్‌సీట్‌లో దాదాపు 70 శాతం వండిన కథనంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావన లేని వాక్యం లేదంటే ఆశ్చర్యం లేదు. ఈ మొత్తం వ్యాసంలో జగన్‌మోహన్‌రెడ్డి అని 29 సార్లు, జగన్ అని 10 సార్లు ఆర్‌కే రాశారు. గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనో, జగన్ అనో అని రాధాకృష్ణ రాసేవారు. ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే జగన్‌మోహన్‘రెడ్డి’ అని నొక్కి మరీ రాస్తున్నారు.
మరి ఇదే వ్యాసంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కూడా 12 చోట్ల ప్రస్తావించారు. ఆయన గురించి రాసేటప్పుడు కేవలం ‘చంద్రబాబు’ అని మాత్రమే రాసుకొచ్చారు. మరి ఆయన పూర్తి పేరు చంద్రబాబు‘నాయుడు’ అని రాసేందుకు మనసు, చేతులు ఎందుకు రాలేదో ఆర్‌కే సమాధానం చెప్పాలి. అంటే జగన్‌ను మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయాలనే కులద్వేషం, చంద్రబాబు విషయానికి వచ్చేసరికి ‘అందరివాడి’గా ప్రొజెక్ట్ చేయాలనే కులపిచ్చిని ఆర్‌కే తనకు తానుగా బయట పెట్టుకుంటున్నాడు.
ఇదే వ్యాసంలో ఆయన తన కులస్పృహను ఆర్‌కే స్పష్టపరిచాడు. ‘ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజికవర్గాలను కూడగట్టారు.
అమరావతితో తమకు సంబంధం లేదన్నట్టుగానే సీమ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రచారం చేస్తు న్నట్టుగానే, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికే అమరావతి అని మెజార్టీ జిల్లాల ప్రజలు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు’ అని రాయడంలో ఆంతర్యం ఏంటి?
అలాగే ‘ఈ తరహా ప్రచారాన్ని కట్టడిచేయడంలో నాడు చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా అమరావతి, పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టుల వల్ల లబ్ధిపొందిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సక్సెస్ అయ్యారు. బడుగుల మనోభావాలను పట్టించుకోని ప్రతిపక్షాలు చివరకు ఆత్మరక్షణలో పడిపోయాయి. మాతృభాష అంటూ ఒక సామాజికవర్గం మాత్రమే గొడవ చేస్తున్నదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రస్తావించడం ద్వారా కమ్మవారిని బడుగులకు శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు’ అని ఆర్‌కే రాశారు. ఈ వాక్యాలు… ‘కొత్తపలుకులా ‘కుల’పలుకులా?’
ఈ తరహా ప్రచారాన్ని కట్టడిచేయడంలో నాడు చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారంటున్న ఆర్‌కే…ఇప్పుడు జగన్‌పై ఆ తరహా ప్రచారం చేసే బాధ్యతను తలకెత్తుకుని సక్సెస్ చేసే క్రమంలో ఇలాంటి విషపూరిత రాతలు రాస్తున్నారా? రాజకీయంగా చంద్రబాబు విఫలమయ్యారనుకుంటే, రంగంలోకి మీరే స్వయంగా రండి, జగన్‌మోహన్‌రెడ్డితో తేల్చుకోండి. అంతేకానీ ఈ ‘కుల’పలుకులు దేనికి ఆర్‌కే.