ఎదురుగా మృత్యువు…24 గంటలూ నిఘా…!

మనుషులు దేనికి భయపడినా భయపడకపోయినా మృత్యువుకు భయపడతారు. హఠాత్తుగా, అనుకోకుండా ఏ ప్రమాదంలోనో ప్రాణాలు కోల్పోతే ఎలాంటి బాధా, భయం ఉండవు. కాని చావు కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం ఎంత భయంకరం? ఎంత నరకయాతన?…

మనుషులు దేనికి భయపడినా భయపడకపోయినా మృత్యువుకు భయపడతారు. హఠాత్తుగా, అనుకోకుండా ఏ ప్రమాదంలోనో ప్రాణాలు కోల్పోతే ఎలాంటి బాధా, భయం ఉండవు. కాని చావు కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం ఎంత భయంకరం? ఎంత నరకయాతన? ఎంతటి మానసిక క్షోభ? ఫలాన రోజున ప్రాణాలు పోతాయని ముందే తెలిస్తే పిచ్చోళ్లయి పోతారు కదా. ఇప్పుడు తీహార్‌ జైల్లో నిర్భయ కేసులో దోషులైన నలుగురి పరిస్థితి ఇలాగే భయంకరంగా ఉంది. వారిని ఉరితీసే రోజు దగ్గర పడుతుండటంతో తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారు. అన్నం నీళ్లు సహించడంలేదు. వారి కళ్లలో ఉరితాళ్లు కదలాడుతున్నాయి. 

ముందుగా నిర్ణయించిన ప్రకారం నలుగురు దోషులు అక్షయ్‌ సింగ్‌, ముఖేష్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మలను ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఉరి తీయాల్సివుంది.  కాని అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడంతో దాన్ని సుప్రీం కోర్టు 17న విచారిస్తుంది. బహుశా కోర్టు దాన్ని తిరస్కరించవచ్చు. ఆ విచారణ ముగియగానే తెల్లవారి వీరికి ఉరిశిక్ష అమలు చేస్తారని అనుకుంటున్నారు. వీరు శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనబడుతోంది. అందుకే తీహార్‌ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. 

తమకు ఉరితాళ్లు బిగుసుకోవడం తథ్యమనే సంగతి దోషులకూ తెలుసు. దీంతో వీరు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ కేసులో మొత్తం దోషులు ఆరుగురు కాగా, నేరం జరిగిన సమయానికి ఒకడు మైనర్‌ కావడంతో వాడిని మూడేళ్లు జువైనల్‌ హోంలో ఉంచి విడుదల చేశారు. అలా అదృష్టంకొద్దీ వాడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇక రామ్‌సింగ్‌ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి మిగిలిన నలుగురిని జైలు అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 

ఇప్పుడు శిక్ష అమలు చేసే సమయం దగ్గరపడటంతో ఆత్మహత్య చేసుకుంటారనే భయం అధికారుల్లో ఎక్కువైంది. దీంతో అధికారులు, సిబ్బంది వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర నలుగురైదుగురు సిబ్బందిని కాపలా పెట్టి కంటికి రెప్ప వేయకుండా చూసుకుంటున్నారు. ఈ సమయంలో దోషుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. కాబట్టి నిఘా పటిష్టంగా ఉంది. జైల్లోని సీనియర్‌ అధికారులతోపాటు తీహార్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ దోషులున్న జైలు నెంబరు 3ను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. 

ఉన్నతాధికారులు జైలు అధికారులు, సిబ్బంది ఫోన్‌ల మీద కూడా నిఘా పెట్టారు. నిర్భయ దోషులను మేం ఉరి తీస్తామంటే..మేం ఉరి తీస్తామని ఇప్పటికీ తమకు అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే అధికారులు వీరి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇప్పటికే మీరట్‌ జైల్లో ఉన్న తలారికి కబురుపెట్టారు.