రాశిఖన్నాపై ఈమధ్య ఓ పుకారు జోరుగా నడిచింది. ఆమె ముంబయిలో ఓ ఖరీదైన ఇల్లు తీసుకుందని, అక్కడికి మకాం మార్చబోతోందంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటోంది రాశి. తను హైదరాబాద్ లోనే ఉంటానని, ఇక్కడే సినిమాలు చేస్తానని చెబుతోంది.
“హైదరాబాద్ లో కొత్తగా ఇల్లు కొన్నాను, ఆ వ్యవహారంలో కాస్త హర్ట్ అయ్యానంటూ వార్తలొచ్చాయి. అవన్నీ అబద్ధం. నాలుగేళ్ల కిందటే నేను ఇల్లు కొన్నాను. హైదరాబాద్ నుంచి ముంబయికి మకాం మార్చేస్తున్నానంటూ మరికొందరు రాశారు. అది కూడా అబద్ధం. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే సినిమాలు చేస్తాను.”
ప్రతి రోజూ పండగే సినిమా ప్రమోషన్ లో భాగంగా గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ, నాలుగేళ్ల కిందటే హైదరాబాద్ లో ఇల్లు కొన్న విషయాన్ని బయటపెట్టింది. దీంతో పాటు సోషల్ మీడియాపై కూడా రియాక్ట్ అయింది. ఓ బిజీ హీరోయిన్ గా సోషల్ మీడియాను రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం కష్టం అంటోంది.
“సినిమాలో టిక్ టాక్ స్టార్ గా కనిపించాను. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నా నుంచి టిక్ టాక్ వీడియోస్ ఆశించకండి. నాకు చాలా కష్టం కానీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఓ నటిగా టిక్ టాక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లాంటివి మెయింటైన్ చేయడం చాలా కష్టం. చాలా టైమ్ తినేస్తుంది. కానీ ట్రై చేస్తాను.”
అనుకోకుండా హీరోయిన్ అయ్యానంటోంది రాశిఖన్నా. చిన్నప్పట్నుంచి సింగర్ అవ్వాలనుకున్నానని, బాగా చదువుకోవాలని కూడా అనుకున్నానని, కానీ అనుకోకుండా హీరోయిన్ అయ్యానని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు నటించడం మినహా ఇంకేం చేయలేనేమో అనిపిస్తోందని అంటోంది.