రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి స్తబ్ధుగానే కొనసాగుతూ ఉంది. 2019 ఎన్నికలు అయిపోయింది హద్దు.. రాయలసీమలో తెలుగుదేశం నేతలు ఎక్కడి వారు అక్కడే అన్నట్టుగా ఉన్నారు. కరోనా సమయంలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కానీ..తెలుగుదేశం నేతలు కదిలింది లేదు! జనం కష్టాల్లో ఉన్న సమయంలో వారిని ఆదుకోవడానికి చేపట్టిన చర్యలతో ఎవ్వరూ వార్తల్లో నిలవలేకపోయారు! అన్నేళ్లు అధికారాన్ని అనుభవించిన వాళ్లు, జేబులు బాగా నింపుకున్న వారు కూడా కరోనా కష్టకాలంలో ప్రజలకు పది రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు!
ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదు కాబట్టి.. ఇక వారిని తామెందుకు పట్టించుకోవాలనుకున్నారో లేక కరోనా సమయంలో తమను తాము కాపాడుకుంటే చాలనుకున్నారో కానీ.. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో మహామహ నేతలున్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా వితరణ కు ముందుకు రాలేదు! కనీసం తమ నియోజకవర్గం పరిధిలో అయినా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవడానికి ముందుకు రాలేదు! వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజలకు చేరువ కావడానికి, ప్రజల్లో తమ ఉనికిని నిలుపుకోవడానికి కరోనా పరిస్థితులు కొనసాగిన రెండేళ్లూ చాలా అనువైన సమయం.
కరోనా ఉన్నా.. నేతలెవ్వరూ రోడ్డుకు వచ్చి సపర్యలు చేసి వారేమీ కరోనా తెచ్చుకోనక్కర్లేదు. తమకున్న ఆర్థిక స్థితిగతులతో వారు ఉపాధిని కోల్పోయిన వారినో, ఆసుపత్రుల ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారినో ఆదుకొనాల్సింది! కరోనా సమయంలో కనీసం ఊరూరా పండ్లు పంచినా.. ఇంత పుణ్యం దక్కేదేమో! అయినా.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రతిపక్షంలో ఉంటూ ఇలాంటి చిన్న పాటి కార్యక్రమాన్ని ఒక్క పంచాయతీ స్థాయిలో కూడా నిర్వహించలేదు!
కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు అయినా.. కనీసం తమ స్థాయికి తగ్గట్టుగా ఒక ఊరినో, పల్లెనో ఎంపిక చేసుకుని పోషకారం అందాలనే తపనతో కాయలూ పళ్లు పంచాయేమో కానీ.. నాలుగు జిల్లాల రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి బాధ్యతలు తీసుకోలేదు! సీమ టీడీపీలో కొందరు నేతల ఆస్తులు రెండు మూడు వేల కోట్ల రూపాయలున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు!
2014 నుంచి 2019 మధ్యన రాయలసీమలో టీడీపీ నేతలు కనీసం ఎమ్మెల్యే అయితే చాలు ఒక్కోరు ఐదు వందల కోట్ల రూపాయలు పైనే వెనకేశారనే అంచనాలున్నాయి! ఐదు శాఖలకు మూడేళ్ల పాటుమంత్రిగా చేసిన ఒక పెద్దాయన ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల పైనే సంపాదించారట! కియా పరిశ్రమ భూముల వ్యవహారంలో మూడు నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తలా ఐదు వందల కోట్ల రూపాయల పైనే వెనకేశారని వినికిడి. మరి ఇలా సంపాదించిన సొమ్ములో అయినా ఒక్క పది కోట్లు తమవి కావనుకుని ఖర్చు పెట్టి ఉంటే.. ఇక్కడి ప్రజలు వారిని గుర్తుంచుకునే వాళ్లు!
అదేంటో. మరి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎలాంటి భావన ఉందంటే, ప్రజలు తమకేదో ద్రోహం చేసినట్టుగా ఉంది వీరి కథ. ఎన్నికల్లో ఓడించాకా.. ఇక తామెందుకు జనం మధ్యకు రావాలి. జనం కోసం పది రూపాయలు అయినా ఎందుకు ఖర్చు చేయాలి, కనీసం జనాల మేలునైనా ఎందుకు కాంక్షించాలనే తీరున తెలుగుదేశం నేతల ఆలోచన ధోరణి కొనసాగుతూ ఉంది. స్వయంగా చంద్రబాబే.. ప్రజలు తనను ఓడించిన ప్రతి సారీ వారు పొరపాటు చేశారు, తప్పు చేశారు..అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. తనను కాదని తన ప్రత్యర్థికి ఓటేశారంటూ చంద్రబాబు ప్రజలను వారి ముందే తూలనాడుతూ ఉంటారు! మరి చంద్రబాబే ఇల మాట్లాడితే.. టీడీపీ లీడర్లు ఇంకెందుకు ప్రజలను లెక్క చేస్తారు!
ఈ పరిస్థితి గత నాలుగేళ్లుగానూ కొనసాగుతూ ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా, స్థానిక ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం నేతల కట్టు కదల్లేదు. రాయలసీమలో ఒక సామెత ఉంది. చెరువు మీద అలగొద్దు..అని! తెలుగుదేశం నేతలు దీన్ని అర్థం చేసుకుంటున్నట్టుగా లేరు. ప్రజలు చెరువు లాంటి వాళ్లు వాళ్ల మీద అలిగిదేఎవరి గొంతు? ప్రజలు తప్పు చేశారని నిందించడం లేదా అలా అనుకుంటూ ఉండటం తెలుగుదేశం నేతల మూర్ఖత్వం మాత్రమే!
మరి ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. వచ్చే ఏడాది ఈ సమయానికి దాదాపు ఎన్నికల షెడ్యూల్ పై క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్ కు సమయం ఆసన్నం అయి ఉంటుంది. మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాయలసీమ నేతల్లో పెద్ద కదలిక లేకపోవడమే మరో విశేషం!
ఎన్నికలు వస్తున్నాయంటే.. నేతలు అప్పుడైనా కదులుతారు. వీరికి చంద్రబాబు కూడా అదే చెబుతూ వచ్చారు. అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అంటూ.. చంద్రబాబు నాయడు మూడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. జమిలి ఎన్నికలు అని, ముందస్తు ఎన్నికలు అని.. ఇలా కథలు అల్లుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు! అవేమీ రాలేదు కానీ.. అసలు ఎన్నికలు అయితే వస్తున్నాయి.
అయితే తెలుగుదేశం నేతల కార్యచరణలో మాత్రం అలాంటి హడావుడి కూడా కనిపించడం లేదు. లోకేష్ తన మటుకు తనేదో నడుచుకుంటూ పోతున్నారు. ఇక చంద్రబాబు మీడియాముందుకు వచ్చినా, మైకు కనిపించినా తనేం మాట్లాడుతున్నారో కూడా తనకే అర్థం కాని రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని స్పష్టం అవుతోంది. ఆశలన్నీ పవన్ కల్యాణ్ మీదే ఉన్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే మరో ఆశ! పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితే వస్తే మాత్రం చిత్తు చిత్తే! ప్రాణమంతా పొత్తుల మీదే ఉంది.
పవన్ కల్యాణ్ తో పొత్తు ఎలా ఉంటుంది, బీజేపీతో పొత్తు కుదురుతుందా లేదా.. ఈ లెక్కలే తెలుగుదేశం పార్టీ వాళ్ల నుంచి వినిపిస్తున్నాయి కానీ, తాము ఏ మేరకు ప్రజలకు చేరువ అవుతున్నామని కానీ, నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటని కానీ వీరు పట్టించుకోవడం లేదు. పొత్తు కుదిరితే పోరాటం లేకపోతే విజయం గురించి ఆలోచనే లేదు. మరి ఇలా అయితే రేపు పొత్తు కుదిరినా.. రాత్రికి రాత్రి వేవ్ వచ్చేస్తుందా?
అలాగే ఏదైనా ఒక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడంలో గతంలో టీడీపీలో ఒక స్ట్రాటజీ ఉండేది. అయితే లోకేష్ పాదయాత్ర విషయంలో మాత్రం అలాంటిది లేకుండా పోయింది. లోకేష్ తన రాజకీయ జీవితానికే పెద్ద పరీక్ష పెట్టుకుంటున్నాడు. ఈ యాత్ర గనుక ఫెయిలయితే, ఒకవేళ ఈ యాత్ర తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని సంపాదించుకోలేకపోతే.. ఆయన ఇక ఏనాటికీ నాయకుడిగా నిలదొక్కుకోలేడు. ఇలాంటప్పుడు నారా లోకేష్ పాదయాత్ర విషయంలో టీడీపీ శ్రద్ధ ఒక రేంజ్ లో ఉండాల్సింది. అలాంటిదేమీ లేదు. పైపెచ్చూ లోకేష్ యాత్ర పరమ పేలవంగా సాగుతోంది. ఎన్నికలకు ముందే లోకేష్ ను చేతగాని వాడిగా నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.
ఇప్పటికిప్పుడు అయితే ఎన్నికలకు తగిన ప్రిపరేషన్ కానీ, మరో ఏడాదిలో ఉన్న ఎన్నికలను ఎదుర్కొనడానికి తగిన స్ట్రాటజీ కానీ తెలుగుదేశం పార్టీ నేతల వద్ద కొరవడింది. ఒక్క నియోజకవర్గం అని కాదు రాయలసీమలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పవన్ కల్యాణ్ తో పొత్తు కుదిరితే, గోదావరి జిల్లాల్లో సీట్లు వస్తే తాము ఇక్కడ అధికార పక్షం అయిపోతామనే భ్రమల లెక్కల్లోనే సీమ తమ్ముళ్లు ఉన్నారనేది నిష్టూరమైన నిజం!