ఓవైపు థియేటర్లలో అఖండ సినిమా కొనసాగుతోంది. ఓ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నప్పుడు మరో సినిమా థియేటర్లలోకి రావడానికి జంకుతుంది. కానీ అఖండ విషయంలో అలా జరగడం లేదు. ఏకంగా 8 సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాలు 2 ఉన్నాయి.
వీటిలో నాగశౌర్య నటించిన లక్ష్య సినిమా కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన వరుడు కావలెను సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ హీరో, ఈసారి లక్ష్య మూవీతో కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కు ఫ్రెండ్ షిప్, లవ్, ఎమోషన్ లాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ఈ మూవీలో సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు శౌర్య.
ఈ మూవీతో పాటు గమనం అనే మరో సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. శ్రియ, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ లాంటి నటులు ఇందులో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ట్రయిలర్ తో ఈ మూవీ ఆకట్టుకుంది. రిజల్ట్ ఎలా ఉండబోతోందో రేపు తెలుస్తుంది. సుజనారావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమౌతున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు మరో 6 సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో మనవూరి పాండవులు, బుల్లెట్ సత్యం, నయీం డైరీస్ లాంటి సినిమాలున్నాయి. ఓవైపు థియేటర్లలో అఖండ మూవీ కొనసాగుతున్నప్పటికీ ఇలా 8 సినిమాలు ఒకేసారి రాక తప్పని పరిస్థితి. ఎందుకంటే, మరో వారం గడిస్తే పుష్ప రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్ ఉంది.
ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు రెడీ అయిపోతున్నాయి. దీంతో చిన్న సినిమాలకు మిగిలింది ఈ వారం మాత్రమే. ఈ వీక్ మిస్సయితే, మరో 2 నెలలు ఎదురుచూడాల్సిందే. అందుకే ఇలా 8 సినిమాలు ఒకేసారి క్యూ కట్టాయి.